FNCC: నేటి నుంచి ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో ఆలిండియా టెన్నిస్ టోర్నీ
- ఏప్రిల్ 6 నుంచి 20వ తేదీ వరకు మెన్స్ టెన్నిస్ టోర్నీ
- FNCC లో మొదటిసారిగా ప్రతిష్ఠాత్మక టెన్నిస్ టోర్నీ నిర్వహణ
- ప్రారంభోత్సవానికి హాజరైన టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య
హైదరాబాదులోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ (FNCC) లో ఆలిండియా పురుషుల టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 20 వరకు ఈ టోర్నీ జరుగుతుంది.
ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్, ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ (AITA) మరియు తెలంగాణ స్టేట్ టెన్నిస్ అసోసియేషన్ (TSTA) సహకారంతో ఈ టోర్నీ జరుపుతున్నారు. FNCC ఓ ప్రతిష్ఠాత్మక టెన్నిస్ టోర్నీ నిర్వహించడం ఇదే మొదటిసారి.
హీరో నాగశౌర్య, అర్జున అవార్డు గ్రహీత సాకేత్ మైనేని, FNCC క్లబ్ ప్రెసిడెంట్ ఘట్టమనేని ఆది శేషగిరిరావు, FNCC స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ చాముండేశ్వరి నాథ్, FNCC కార్యదర్శి ముళ్లపూడి మోహన్, వైస్ ప్రెసిడెంట్ తుమ్మల రంగారావు, జాయింట్ సెక్రటరీ వీవీఎస్ఎస్ పెద్ది రాజు, ఇతర కమిటీ సభ్యులు ఈ టోర్నీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా FNCC ప్రెసిడెంట్ ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ... గతంలో కూడా FNCC తరఫున చాలా కార్యక్రమాలు చేశామని వెల్లడించారు. ఇప్పుడు ఈ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహిస్తుండడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. తమకు సపోర్ట్ చేసేందుకు ముందుకొచ్చిన స్పాన్సర్స్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. సినిమా షూటింగ్లో బిజీగా ఉండి కూడా అడగ్గానే ఈవెంట్ కి విచ్చేసిన హీరో నాగశౌర్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని పేర్కొన్నారు.
నాగశౌర్య మాట్లాడుతూ... సినీ ఇండస్ట్రీ లోకి రాకముందు తాను కూడా ఒక టెన్నిస్ ప్లేయర్ అని వెల్లడించారు. స్టేట్ లెవెల్ టోర్నమెంట్ వరకు ఆడానని, ఇండస్ట్రీలోకి వచ్చి టెన్నిస్ కి దూరమయ్యానని తెలిపారు.
ఇప్పుడు FNCC తరఫున ఇలాంటి టోర్నమెంట్స్ పెట్టి క్రీడాకారులను ప్రోత్సహించడం చాలా మంచి విషయం అని అభినందించారు. ఈ ఈవెంట్ లో తనను కూడా భాగం చేసినందుకు ఆదిశేషగిరిరావు గారికి, ముళ్ళపూడి మోహన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని నాగశౌర్య వెల్లడించారు.