Rahul Gandhi: కేసీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి... బీఆర్ఎస్ అవినీతికి కవిత నిదర్శనం: తుక్కుగూడ సభలో కాంగ్రెస్ మంత్రుల ఫైర్

Ministers fire at KCR and Kavitha in Thukkuguda meeting

  • రాహుల్ గాంధీకి ప్రధానిగా ఒక్క అవకాశమిద్దామని సీతక్క పిలుపు
  • కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని దించేందుకే తుక్కుగూడలో సమావేశమయ్యామన్న పొన్నం ప్రభాకర్
  • ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై జూపల్లి కృష్ణారావు ఆగ్రహం

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని తెలంగాణ మంత్రులు హెచ్చరించారు. రాహుల్ గాంధీకి ప్రధానిగా ఒక్క అవకాశమిద్దామని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో భారీ అవినీతి జరిగిందని... ఇందుకు కేసీఆర్ కూతురు కవిత నిదర్శనమన్నారు. శనివారం సాయంత్రం తుక్కుగూడలో కాంగ్రెస్ 'జన జాతర' సభలో మంత్రులు మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి: కొండా సురేఖ

కేటీఆర్, కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. కేసీఆర్ నిన్న ప్రెస్ మీట్‌లో కుక్కల కొడుకులు అని తిడుతున్నారని... అలా ఎవరిని తిట్టినట్లు? మహిళలను తిట్టినట్లే కదా అని ధ్వజమెత్తారు. కేసీఆర్ అలా తిట్టినందుకు ఆయనకు నోటీసులు ఇవ్వవద్దా? అని ప్రశ్నించారు.

రాహుల్ గాంధీకి ఒక్క అవకాశం ఇద్దాం: సీతక్క

రాహుల్ గాంధీకి ప్రధానిగా ఒక్క అవకాశం ఇద్దామని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. ఆయనను ప్రధానిగా చేసే బాధ్యత మనపై ఉందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్ పార్టీని అంతం చేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ వికసిత్ భారత్ అంటోంది... కానీ విద్వేష దేశంగా మార్చిందని ఆరోపించారు. రాహుల్ గాంధీ పేదల పెన్నిది, త్యాగాల సన్నిధి అని కొనియాడారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేసేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పని చేయాలన్నారు. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలు గెలిచి రాహుల్ గాంధీకి కానుకగా ఇద్దామన్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని దించేందుకు సమావేశమయ్యాం: పొన్నం ప్రభాకర్

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని దించేందుకు తుక్కుగూడలో సమావేశమయ్యామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు గాను మనం 15 గెలుచుకోవాలని పిలుపునిచ్చారు. తాము అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. మిగతా వాటిని లోక్ సభ ఎన్నికల తర్వాత అమలు చేస్తామన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు. ఆయన నిన్న సిరిసిల్లలో మాట్లాడిన భాష సరికాదని.. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని సూచించారు. బీజేపీ, బీఆర్ఎస్ తోడుదొంగలని విమర్శించారు. మనం కూడా రాముడి భక్తులమేనని... కానీ బీజేపీ నిస్సిగ్గుగా రాముడిని రాజకీయాల్లోకి తీసుకు వస్తోందని మండిపడ్డారు.

బీఆర్ఎస్ అవినీతికి కవిత నిదర్శనం: జూపల్లి

80వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ నిన్న సిరిసిల్లలో మాట్లాడిన మాటలు సరికాదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అది నోరా లేదా బురదా? అని ధ్వజమెత్తారు. ప్రాంతేతరుడు తప్పు చేస్తే ఇక్కడి నుంచి పారద్రోలాలని... మన ప్రాంతం వాడే తప్పు చేస్తే పాతరేద్దామని ఉద్యమం సమయంలో కేసీఆర్ పిలుపునిచ్చారని.... మరి పదేళ్లపాటు దారుణ పాలన చేసిన కేసీఆర్‌ను ఇప్పుడు ఏం చేయాలి? అని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్‌కు అప్పగిస్తే వేల కోట్ల రూపాయల అక్రమాలు చేశారని ధ్వజమెత్తారు. వారి అవినీతికి రుజువు ఆయన కూతురు కవిత అని వ్యాఖ్యానించారు. టెలిఫోన్ ట్యాపింగ్ వంటి దొంగ... లంగ పనులు ఎందుకు? అని మండిపడ్డారు. మంది సంసారాల్లోకి ఎందుకు తొంగి చూడాలని ప్రశ్నించారు. 

కాగా, తుక్కుగూడ బహిరంగసభ వేదిక వద్దకు రాహుల్ గాంధీ ఏడుగంటల తర్వాత వచ్చారు. ఆయన వెంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తదితరులు ఉన్నారు.

  • Loading...

More Telugu News