Nara Lokesh: వాలంటీర్ల ద్వారానే రూ.4 వేల పెన్షన్ ఇళ్ల వద్దకే అందిస్తాం: నారా లోకేశ్
- మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేశ్ ప్రచారం
- రేవేంద్రపాడులో రచ్చబండ కార్యక్రమం
- అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే పెన్షన్ పెంచి అందజేస్తామని హామీ
- రాజకీయ లబ్ధి కోసం కుల,మతాల పేరుతో జగన్ చిచ్చుపెడుతున్నారని ఆగ్రహం
వాలంటీర్లను వైసీపీ రాజకీయంగా ఉపయోగించడం వల్లే వారిపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వందరోజుల్లో వాలంటీర్ల ద్వారానే 4 వేల రూపాయల పెన్షన్ తో పాటు ఇతర సంక్షేమ పథకాలు అందజేస్తామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం రేవేంద్రపాడు రచ్చబండ సభలో లోకేశ్ మాట్లాడుతూ... పెన్షన్ల విషయంలో జగన్ తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
"దేశంలో తొలిసారి పెన్షన్ ప్రవేశపెట్టింది అన్న ఎన్టీఆర్. రూ.200 రూపాయల పెన్షన్ ను రూ.2 వేలు పెంచింది చంద్రబాబు. ఎన్నికల తర్వాత రూ.4 వేలు ఇచ్చేది కూడా చంద్రబాబే. ముఖ్యమంత్రి జగన్ కుల,మతాల పేరుతో చిచ్చుపెట్టి రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తున్నారు. 2014-19 మధ్య ఏనాడు ముస్లిం మైనారిటీలపై దాడులు జరగలేదు.
జగన్ అధికారంలోకి వచ్చాక నంద్యాలలో అబ్దుల్ సలామ్, పలమనేరులో మిస్బా ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారు, నర్సరావుపేటలో మసీదు ఆస్తుల పరిరక్షణకు పోరాడిన ఇబ్రహీంను నరికి చంపారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో రంజాన్ తోఫా, దుల్హన్ పథకాలు అమలు చేశాం. ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనాలు అందించాం. మైనారిటీల క్షేమాన్ని కాంక్షించేది ఎవరో ముస్లిం సోదరులు గుర్తించాలి. రాబోయే ఎన్నికల్ల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముస్లిం మైనారిటీలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం.
దళితులపై కూడా జగన్ ప్రభుత్వం కక్షగట్టినట్లుగా వ్యవహరిస్తోంది. గత ప్రభుత్వం ఎస్సీల కోసం ప్రవేశపెట్టిన 27 సంక్షేమ పథకాలను రద్దుచేశారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబును జగన్ పక్కన కూర్చోబెట్టి సమీక్షలు చేస్తున్నారు. జగన్ కపటప్రేమను దళితులు, మైనారిటీలు గమనించాలి" అని లోకేష్ విజ్ఞప్తి చేశారు.