Thierry Delaporte: విప్రో కంపెనీ సీఈవో పదవికి డెలాపోర్ట్ రాజీనామా
- నూతన సీఈవోగా శ్రీనివాస్ పల్లియాకు బాధ్యతలు అప్పగింత
- ఈ నెల 19న 4వ త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో సారథ్య మార్పులు ప్రకటన
- గతేడాది కాలంలో విప్రోకి గుడ్‌బై చెప్పిన కీలక అధికారులు
దేశీయ ఐటీ దిగ్గజం విప్రోలో కీలక పరిణామం జరిగింది. కంపెనీ ఎండీ, సీఈవో పదవికి థియరీ డెలాపోర్ట్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామా ఏప్రిల్ 6 నుంచే అమల్లోకి వచ్చింది. అయితే మే 31 వరకు కంపెనీ బాధ్యతల్లో కొనసాగుతారని స్టాక్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో విప్రో పేర్కొంది. 2020 జులైలో విప్రో సీఈవోగా థియరీ డెలాపోర్ట్ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఫ్రెంచ్ ఐటీ కంపెనీ క్యాప్‌జెమినీలో పనిచేసిన ఆయన రూ.80 కోట్ల వార్షిక వేతనంతో విప్రోలో రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. దేశీయ ఐటీ రంగంలో అత్యధిక ప్యాకేజీ అందుకున్న సీఈవోగా థియరీ నిలిచారు. కాగా ఏడాది కాలంగా విప్రోలో కీలక స్థానాల్లో పనిచేసిన వ్యక్తులు కంపెనీని వీడారు. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) జతిన్ దలాల్, చీఫ్ గ్రోత్ ఆఫీసర్ స్టెఫానీ ట్రాట్మాన్ సహా పది మంది కీలక అధికారులు కంపెనీకి గుడ్‌బై చెప్పారు. ఆ జాబితాలో డెలాపోర్ట్ కూడా చేరారు.
కొత్త సారథిగా శ్రీనివాస్ పల్లియా
విప్రో కంపెనీ కొత్త సారథిగా శ్రీనివాస్ పల్లియాను నియమించినట్లు విప్రో ప్రకటించింది. ఈ నెల 19న కంపెనీ 4వ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటించడానికి ముందు ఈ సారథ్య మార్పుల వివరాలను వెల్లడించింది. నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీ సిఫారసు మేరకు కొత్త సీఈవో, ఎండీగా శ్రీనివాస్ పల్లియా నియామకానికి బోర్డు ఆమోదం తెలిపినట్టు ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో కంపెనీ వివరించింది. ఈ నెల 7 నుంచి ఐదేళ్లపాటు శ్రీనివాస్ ఈ పదవిలో కొనసాగుతారని వివరించింది. అయితే ఈ నియామకానికి విప్రో వాటాదారులతో పాటు అవసరాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం కూడా తన ఆమోదం తెలియజేయాల్సి ఉంటుంది. కాగా అమెరికాలోని న్యూజెర్సీ నుంచే ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. కంపెనీ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీకి రిపోర్ట్ చేయనున్నారు.
ఇక శ్రీనివాస్ పల్లియా విషయానికి వస్తే 1992లో ఆయన విప్రోలో చేరారు. 30 సంవత్సరాలుగా కంపెనీకి సంబంధించిన కీలక బాధ్యతలు చేపట్టి విశేష సేవలు అందించారు. ప్రస్తుతం విప్రో ఎగ్జిక్యూటివ్ బోర్డులో సభ్యుడిగా ఉన్నారు. అంతేకాదు విప్రో అనుబంధ కంపెనీ అయిన ‘అమెరికాస్ 1’కు సీఈవోగా ప్రస్తుతం కొనసాగుతున్నారు.