Himanta Sarma: కాంగ్రెస్ మేనిఫెస్టోపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు
- ఈ మేనిఫెస్టో పాకిస్థాన్ ఎన్నికలకు నప్పుతుందన్న బీజేపీ నేత
- పొరుగు దేశం పాక్‌లో ఈ మేనిఫెస్టో పనికొస్తుందని వ్యాఖ్య
- అధికారం కోసం కాంగ్రెస్ సమాజాన్ని విభజించాలనుకుంటోందని తీవ్ర విమర్శలు చేసిన హిమంత బిశ్వ శర్మ
- పార్టీ మారిన వ్యక్తులకు లౌకిక తత్వం అర్థం కాదని కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ పార్టీపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి విరుచుకుపడ్డారు. హస్తం పార్టీ శనివారం ప్రకటించిన మేనిఫెస్టోపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో భారత్ కంటే పొరుగున ఉన్న పాకిస్థాన్‌లో ఎన్నికలకు నప్పుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘ ఇది భారత్‌లో జరిగే ఎన్నికల కోసం కాదు. పాకిస్థాన్‌లో ఎన్నికల కోసం ఉద్దేశించిన మేనిఫెస్టో అనిపిస్తోంది’’ అని అన్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని జోర్హాట్ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అధికారంలోకి వచ్చేందుకు సమాజాన్ని విభజించేందుకు కూడా కాంగ్రెస్ వెనుకాడడంలేదని బిశ్వ శర్మ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తోంది బుజ్జగింపుల రాజకీయమని, దీనిని ఖండిస్తున్నానని ఆయన అన్నారు. దేశంలోని ఎవరూ ట్రిపుల్ తలాక్‌ను పునరుద్ధరించాలని కోరుకోరని అన్నారు. హిందువులైనా, ముస్లింలైనా ట్రిపుల్ తలాక్‌ను కోరుకోరని అన్నారు. బాల్య వివాహాలు, బహుభార్యత్వానికి ఎవరూ మద్దతు ఇవ్వబోరని అన్నారు. సమాజాన్ని విభజించి అధికారంలోకి రావాలనే కాంగ్రెస్ ఆలోచన ఈ మేనిఫెస్టో ద్వారా స్పష్టంగా అర్థమవుతోందని విమర్శించారు.
కాగా సీఎం బిశ్వ శర్మ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చింది. బిశ్వ శర్మ లాంటి పార్టీ మారిన వ్యక్తులకు లౌకిక, సమ్మిళిత తత్వాలు అర్థం కావని విమర్శించింది. సమాజంలోని అన్ని వర్గాల ప్రయోజనాలను కాపాడడమే తమ మేనిఫెస్టో లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ పునరుద్ఘాటించింది. కాగా 5 న్యాయాల కింద 25 హామీలతో కాంగ్రెస్ శుక్రవారం తన మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే.