YS Jagan: చంద్రబాబును 'పశుపతి'తో పోల్చుతూ సీఎం జగన్ వ్యాఖ్యలపై సీఈవో నోటీసులు
- మేమంతా సిద్ధం సభలో చంద్రబాబుపై సీఎం జగన్ విమర్శలు
- అరుంధతి సినిమాలోని పశుపతితో పోల్చుతూ వ్యాఖ్యలు
- మోసం చేయడమే చంద్రబాబు అలవాటు అని వెల్లడి
- సీఎం జగన్ వ్యాఖ్యలను సీఈవో దృష్టికి తీసుకెళ్లిన వర్ల రామయ్య
- 48 గంటల్లో సీఎం జగన్ వివరణ ఇవ్వాలంటూ ముఖేశ్ కుమార్ మీనా నోటీసులు
ఇటీవల మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ విపక్ష నేత చంద్రబాబును అరుంధతి సినిమాలోని పశుపతితో పోల్చడం తెలిసిందే. చంద్రబాబు పసుపతి... మోసం చేయడమే చంద్రబాబు అలవాటు అంటూ వ్యాఖ్యానించారు.
అయితే, ఈ వ్యాఖ్యలను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేశ్ కుమార్ మీనా దృష్టికి తీసుకెళ్లారు. సీఎం జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎన్నికల్ కోడ్ ఉల్లంఘన కిందికి వస్తాయని సీఈవోకు ఫిర్యాదు చేశారు.
దీనిపై సీఈవో ముఖేశ్ కుమార్ మీనా స్పందించారు. సీఎం జగన్ కు నోటీసులు జారీ చేశారు. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘనే అని ప్రాథమిక అంచనాకు వచ్చామని మీనా తెలిపారు. సీఎం జగన్ సకాలంలో స్పందించకపోతే ఈసీ తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.