Dil Raju: నెగెటివ్ ప్రచారం ఇండస్ట్రీకి మంచిది కాదు... 'ఫ్యామిలీ స్టార్' అంశంపై దిల్ రాజు వ్యాఖ్యలు
- విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్
- ఇటీవల విడుదలైన చిత్రం
- ఏమంత ఆశాజనకంగా లేని రివ్యూలు
- మంచి సినిమాకు ప్రేక్షకులు రాకుండా అడ్డుకోవడం సరికాదన్న దిల్ రాజు
విజయ్ దేవరకొండ కొత్త చిత్రం ఫ్యామిలీ స్టార్ పై వస్తున్న రివ్యూల పట్ల నిర్మాత దిల్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యామిలీ స్టార్ చిత్రంపై ప్రేక్షకుల స్పందన ఒకలా ఉంటే, సోషల్ మీడియాలో మరోలా ట్రోల్ చేస్తున్నారని అసంతృప్తి వెలిబుచ్చారు. నెగెటివ్ ప్రచారం చిత్ర పరిశ్రమకు మంచిది కాదని దిల్ రాజు హితవు పలికారు. ఓ సినిమా ప్రేక్షకాదరణ పొందలేదంటే ఆ విషయాన్ని అందరూ అంగీకరించాల్సిందేనని, కానీ ఓ మంచి సినిమాకు ప్రేక్షకులు రాకుండా అడ్డుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు.
"తల్లిదండ్రులు, తాతలు, బామ్మలు... ఇలా ఈ సినిమా చూసినవాళ్లందరూ బాగుందని చెబుతున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ సినిమా రీచ్ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వచ్చి ఈ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు.
దీని ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఒకటే... మేం మంచి సినిమానే తీశాం. మీరు థియేటర్లకు వచ్చి చూడండి. నచ్చితే నలుగురికి చెప్పండి... నచ్చలేదంటే ఆ విషయాన్ని మేం కూడా అంగీకరిస్తాం. కానీ, ఇప్పుడీ సినిమాను చూసిన వారు నాకు మెసేజ్ లు పంపిస్తున్నారు, కొందరు కాల్ చేస్తున్నారు. కొందరు నన్ను కలిసి మాట్లాడారు... ఈ సినిమా బాగుంది, బయట ఎందుకింత నెగెటివ్ ప్రచారం ఉంది? అని అడుగుతున్నారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమా బాగుందంటున్నారు... మీరు కూడా థియేటర్లకు వెళ్లి చూసి ఆస్వాదించండి" అని వివరించారు.
కాగా, ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని దిల్ రాజు ఓ థియేటర్ కు వచ్చి వీక్షించారు. అంతేకాదు, సినిమాకు వచ్చిన ప్రేక్షకులతో స్వయంగా మాట్లాడి పబ్లిక్ టాక్ తెలుసుకున్నారు.