Mumbai Indians: ఎట్టకేలకు ముంబయి మురిసింది... పోరాడి ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్

MI registers first win after three consecutive loses

  • మూడు ఓటముల తర్వాత ముంబయికి తొలి గెలుపు
  • ఢిల్లీ క్యాపిటల్స్ పై 29 పరుగుల తేడాతో విజయం
  • 235 పరుగుల లక్ష్యఛేదనలో 205 పరుగులు చేసిన ఢిల్లీ

ఐపీఎల్ లో హ్యాట్రిక్ ఓటములతో డీలాపడిన ముంబయి ఇండియన్స్ ఎట్టకేలకు గెలుపు తలుపు తట్టింది. వరుసగా మూడు పరాజయాల అనంతరం తొలి విజయం నమోదు చేసింది. ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ తో హోరాహోరీగా జరిగిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ 29 పరుగుల తేడాతో నెగ్గింది. 

ముంబయి వాంఖెడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 234 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 49, ఇషాన్ కిషన్ 42, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 39, టిమ్ డేవిడ్ 45 (నాటౌట్), రొమారియా షెపర్డ్ 39 (నాటౌట్) పరుగులు చేశారు.

అనంతరం, 235 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ పోరాడి ఓడింది. ఆ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 205 పరుగులు చేసి పరాజయం చవిచూసింది. ట్రిస్టాన్ స్టబ్స్ స్వైర విహారం చేసినా, ఇతర బ్యాట్స్ మెన్ నుంచి సహకారం లభించలేదు. స్టబ్స్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సులతో 71 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 

అంతకుముందు, ఢిల్లీ క్యాపిటల్స్ ఛేజింగ్ లో 22 పరుగులకే ఓపెనర్ డేవిడ్ వార్నర్ (10) వికెట్ కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ పృథ్వీ షా ధాటిగా ఆడడంతో స్కోరుబోర్డు ముందుకు ఉరికింది. పృథ్వీ షా 40 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు. అభిషేక్ పోరెల్ 41 పరుగులు చేశాడు. 

అయితే కెప్టెన్ రిషబ్ పంత్ (1), అక్షర్ పటేల్ (8), లలిత్ యాదవ్ (3) విఫలం కావడం ఢిల్లీ అవకాశాలను ప్రభావితం చేసింది. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో గెరాల్డ్ కోట్జీ 4, బుమ్రా 2, షెపర్డ్ 1 వికెట్ తీశారు. 

గుజరాత్ పై టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్

ఐపీఎల్ లో నేడు డబుల్ హెడర్ లో భాగంగా రెండో మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లక్నోలో జరుగుతోంది. టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.


  • Loading...

More Telugu News