YS Jagan: చంద్రబాబుకు ఓటేస్తే నేను తెచ్చిన పథకాలన్నీ ఆపేస్తాడు: కొనకనమిట్లలో సీఎం జగన్

CM Jagan said if Chandrabau come into power he will stop all schemes
  • ప్రకాశం జిల్లా కొనకనమిట్లలో మేమంతా సిద్ధం సభ
  • హాజరైన సీఎం జగన్
  • చంద్రబాబు ఆలోచనలు ఎప్పటికీ పాతాళంలోనే ఉంటాయని విమర్శలు
  • అవ్వాతాతలను చంపిన నరహంతకుడు చంద్రబాబు అని ఘాటు వ్యాఖ్యలు
ఏపీ సీఎం జగన్ ఈ సాయత్రం ప్రకాశం జిల్లా కొనకనమిట్లలో మేమంతా సిద్ధం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో విపక్షనేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమం ఆగిపోతుంది... మీ బిడ్డ తెచ్చిన పథకాలన్నీ చంద్రబాబు ఆపేస్తాడు అని స్పష్టం చేశారు. 

చంద్రబాబు ఆలోచనలు ఎప్పటికీ పాతాళంలోనే ఉంటాయని... వెన్నుపోట్లు, కుట్రలు, మోసాలు, అబద్ధాలే చంద్రబాబు మార్కు రాజకీయం అని సీఎం జగన్ విమర్శించారు. ఇంటింటికీ అందుకున్న సంక్షేమాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని, ఇప్పుడు పెన్షన్లు అందకుండా చేయడమే అందుకు నిదర్శనమని అన్నారు. నిమ్మగడ్డ రమేశ్ తో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించి అవ్వాతాతల పెన్షన్లను అడ్డుకున్నది చంద్రబాబే అని సీఎం జగన్ ఆరోపించారు. 

"చంద్రబాబు ఒక శాడిస్టు... అవ్వాతాతలను బలిగొన్నాడు, దళితులను అవమానించాడు... అలాంటి వ్యక్తిని శాడిస్టు అనక ఇంకేం అనాలి? వైసీపీ ప్రభుత్వంలో తన కుటుంబానికి మేలు జరిగిందని చెప్పిన గీతాంజలిని వేధించి చంపారు. మన ప్రభుత్వంలో జరుగుతున్న మంచిని చూసి చంద్రబాబు అసూయ ద్వేషాలతో రగిలిపోతున్నాడు... చంద్రబాబు కడుపుమంటకు 20 జెలూసిల్ ట్యాబ్లెట్లు వేసుకున్నా సరిపోవు. తన అసూయతో అవ్వాతాతలను చంపుతూ నరహంతకుడిలా మారాడు. 

ఆదివారం అయినా, సెలవు రోజు అయినా వాలంటీర్లు ఇళ్ల వద్దకే వచ్చి పెన్షన్లు ఇచ్చేవారు. వాలంటీరు వ్యవస్థతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి... అందుకే వాలంటీరు వ్యవస్థ లేకుండా చేయాలని చూస్తున్నాడు. మండిపోతున్న ఎండల్లో అవ్వాతాతలను పెన్షన్ కోసం నిలబెట్టి వాళ్ల ప్రాణాలు బలిదీసుకుంటున్నాడు. పేదలను బలిదీసుకుంటున్న చంద్రబాబు శాడిస్ట్ కాక ఇంకేంటి? 

చంద్రబాబు అంటే గుర్తుకువచ్చే పథకం ఒక్కటైనా ఉందా? 14 ఏళ్లు సీఎంగా చేశానని చెప్పుకుంటాడు... ఏంచేశాడో ప్రజలకు తెలుసు. ఈ ఐదేళ్లలో మీ బిడ్డ పాలన ఎలా ఉందో మీరు చూశారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్లతో ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్ లు, నాడు-నేడు ద్వారా ప్రభుత్వ బడులు, ఆసుపత్రులకు కొత్త రూపు, పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం చదువు, ఆరోగ్య శ్రీ పరిధి రూ.25 లక్షలకు పెంపు, అవ్వాతాతలకు రూ.3 వేల పెన్షన్, అక్కచెల్లెమ్మలకు రూ.2.70 లక్షల కోట్ల నగదు బదిలీ... ఇవన్నీ మీ బిడ్డ పాలనలో జరిగినవే. 

ప్రజలకు మేలు చేయడం కోసం మనకు అధికారం కావాలనుకున్నాం. చంద్రబాబు దోచుకోవడం కోసం అధికారం కావాలంటున్నాడు. 2014లోనూ ఈ ముగ్గురు కలిసి కూటమిగా వచ్చారు. ఆనాడు అనేక హామీలతో ఇంటింటికీ తిరిగారు. ఆ హామీలు ఏమయ్యాయని అడుగుతున్నా. పొదుపు సంఘాల రుణమాఫీ అన్నారు, నిరుద్యోగులకు రూ.2 వేల భృతి అన్నారు... నెరవేర్చారా అని అడుగుతున్నా. చంద్రబాబు చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

ఇప్పుడు పేదల భవిష్యత్ ను కాలరాసేందుకు మూడు పార్టీల కూటమి అంటూ వస్తున్నారు... ఇవి జగన్ కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావు... చంద్రబాబు మోసాలకు, ప్రజలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు... జెండాలు జతకట్టి వస్తున్న వాళ్లకు, ప్రజలే అజెండాగా వస్తున్న మనకు జరుగుతున్న ఎన్నికలు ఇవి... మన అడుగులు ముందుకా, వెనక్కా అని తేల్చే ఎన్నికలు ఇవి"... అంటూ సీఎం జగన్ ప్రసంగించారు.
YS Jagan
Chandrababu
Memantha Siddham
Konakanamitla
Prakasam District
YSRCP
TDP

More Telugu News