Prashant Kishor: తెలంగాణలో బీజేపీ అవకాశాలపై ప్రశాంత్ కిశోర్ ఆసక్తికర వ్యాఖ్యలు
- తెలంగాణలో బీజేపీకి మంచి అవకాశాలున్నాయన్న ప్రశాంత్ కిశోర్
- తెలంగాణలో బీజేపీ మొదటి స్థానంలో కానీ, రెండో స్థానంలో కానీ ఉంటుందని వెల్లడి
- దేశవ్యాప్తంగా బీజేపీకి 300 సీట్లు వస్తాయని అంచనా
లోక్ సభ ఎన్నికల్లో ఈసారి తెలంగాణలో బీజేపీకి మంచి అవకాశాలు ఉన్నాయని మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. తెలంగాణలో బీజేపీ మొదటి స్థానంలో కానీ, రెండో స్థానంలో కానీ నిలుస్తుందని జోస్యం చెప్పారు. తెలంగాణలో పరిస్థితుల దృష్ట్యా బీజేపీకి ఇది పెద్ద విజయమే అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇక, ఒడిశాలో, పశ్చిమ బెంగాల్ లో కాషాయ దళానికి ఎదురుండకపోవచ్చని అన్నారు.
అయితే, ఆ పార్టీకి 370 సీట్లు వచ్చే అవకాశాలు మాత్రం లేవని ప్రశాంత్ కిశోర్ తెలిపారు. ఓవరాల్ గా చూసుకుంటే బీజేపీకి 300కి పైగా సీట్లు వస్తాయని పేర్కొన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ఆధిపత్యంలో ఎలాంటి మార్పు ఉండబోదని, అదే సమయంలో దక్షిణ భారతదేశం, తూర్పు రాష్ట్రాల్లో ఆ పార్టీకి గతంలో కంటే కొంచెం ఎక్కువ సీట్లు రావొచ్చని, ఓట్ల శాతం పెరగొచ్చని ప్రశాంత్ కిశోర్ వివరించారు.