IPL 2024: గుజరాత్‌ను వణికించిన యశ్ ఠాకూర్.. లక్నో ఖాతాలో మరో విజయం!
- లక్నోలో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్
- 33 పరుగుల తేడాతో గుజరాత్‌ను మట్టికరిపించిన లక్నో
- 5 వికెట్లతో లక్నో విజయంలో కీలక పాత్ర పోషించిన యశ్ ఠాకూర్
- అర్ధ శతకం(58) తో రాణించిన మార్కస్ స్టొయినిస్
లక్నో వేదికగా గుజరాత్ టైటాన్స్ (జీటీ) తో నిన్న జరిగిన మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 164 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన గుజరాత్ 18.5 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌట్ అయింది. లక్నో బౌలర్ యశ్ ఠాకూర్ 5 వికెట్లు తీసి జీటీని కుప్పకూల్చాడు. గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్ 31, రాహుల్ తెవాటియా 30, గిల్ 19, విజయ్ శంకర్ 17 పరుగులు చేశారు. ఎల్ఎస్జీ బౌలర్లలో యశ్ ఠాకూర్ 5 వికెట్లు పడగొట్టగా.. కృనాల్ పాండ్యా 3, నవీన్ ఉల్ హక్, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీశారు.
అంతకుముందు మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. మార్కస్ స్టొయినిస్ హాఫ్ సెంచరీ (58) తో రాణించాడు. అలాగే కెప్టెన్ కేఎల్ రాహుల్ 33, నికోలాస్ పూరన్ 32 పరుగులతో పర్వాలేదనిపించారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్, దర్శన్ నల్కండే తలో 2 వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టాడు.
అనంతరం 164 పరుగుల లక్ష్య ఛేదనతో బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్‌కు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు ఈ ద్వయం 54 పరుగులు జోడించింది. అయితే, 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద గిల్‌ను యశ్ ఠాకూర్ క్లీన్ బోల్డ్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కేన్ విలియమ్సన్ (01), బీఆర్ శరత్ (02) వెంటవెంటనే అవుట్ అయ్యారు. 31 పరుగులతో క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన సాయి సుదర్శన్‌ను కృనాల్ పాండ్యా పెవిలియన్ పంపించాడు. అలాగే విజయ్ శంకర్ (17) కూడా మరోసారి నిరాశపరిచాడు.
మధ్యలో కొద్దిసేపు రాహుల్ తెవాటియా 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 30 పరుగులు చేసి లక్నో బౌలర్లను నిలువరించే ప్రయత్నం చేశాడు. కానీ, జీటీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో చివరికి 18.5 ఓవర్లలో 130 పరుగులకు కుప్పకూలింది. 5 వికెట్లు తీసి ఎల్ఎస్జీ విజయంలో కీలక పాత్ర పోషించిన యశ్ ఠాకూర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ విజయంతో లక్నో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకూ 4 మ్యాచులు ఆడిన ఎల్ఎస్జీ 3 విజయాలు సాధించింది. మరోవైపు శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ 5 మ్యాచుల్లో 2 విజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతోంది.