Benjamin Netanyahu: విజయానికి అడుగు దూరంలోనే ఉన్నాం.. ఇజ్రాయెల్ ప్రధాని వ్యాఖ్య
- హమాస్‌తో యుద్ధం మొదలై 6 నెలలు
- ఈ సందర్భంగా ఆదివారం ఇజ్రాయెల్ ప్రధాని నేతృత్వంలో కేబినెట్ మీటింగ్
- బందీలందరినీ హమాస్ విడిచిపెట్టే వరకూ కాల్పుల విరమణ ఉండదని స్పష్టీకరణ
గాజా యుద్ధంలో తాము విజయానికి అడుగు దూరంలోనే ఉన్నామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యానించారు. హమాస్ తన చెరలో బంధించిన వారందరినీ విడిచిపెట్టే వరకూ యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. యుద్ధం మొదలై ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా ఆయన ఆదివారం కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ యుద్ధం ఇజ్రాయెల్‌కు వేదన మిగిల్చిందని అన్నారు.
కైరోలో అంతర్జాతీయ మధ్యవర్తుల ఆధ్వర్యంలో త్వరలో శాంతి చర్చలు ప్రారంభం కానున్న అంశంపై కూడా నెతన్యాహు స్పందించారు. ‘‘హమాస్ చెరలోని వారందరికీ స్వేచ్ఛ లభించే వరకూ కాల్పుల విరమణ జరగదు. ఇజ్రాయెల్ ఏదైనా ఒప్పందం కోసం రెడీగానే ఉంది.. లొంగిపోడానికి మాత్రం సిద్ధంగా లేదు’’ అని ఆయన అన్నారు.
గాజాలో మానవతాసాయం అందిస్తున్న వరల్డ్ సెంట్రల్ కిచెన్‌కు చెందిన ఏడుగురు వర్కర్లు ఏప్రిల్ 1న ఇజ్రాయెల్ వాయుసేన దాడిలో మరణించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. గురువారం ఇజ్రాయెల్ ప్రధానికి ఫోన్ చేసిన అమెరికా అధ్యక్షుడు ఆయనను తక్షణం కాల్పుల విరమణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అమెరికా సాయం కూడా నిలిచిపోవచ్చని సూచన ప్రాయంగా తెలియజేశారు.