Boeing Jet: టేకాఫ్ సందర్భంగా ఊడిపోయిన విమానం ఇంజెన్ కవర్.. వీడియో ఇదిగో!
- డెన్వర్ నుంచి బయలుదేరిన సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఘటన
- సమస్య గుర్తించిన వెంటనే విమానాన్ని ఎయిర్‌పోర్టులో దింపిన పైలట్
- ఘటనపై అమెరికా పౌర విమానయాన నియంత్రణ సంస్థ దర్యాప్తు
టేకాఫ్ సందర్భంగా విమానం ఇంజెన్ కవర్ ఊడిపోయిన ఘటన అమెరికాలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. డెన్వర్ నుంచి టేకాఫ్ సందర్భంగా సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానం ఇంజెన్‌పై ఉండే కవర్ అకస్మాత్తుగా ఊడిపోయింది. కొంత భాగం రెక్కలను కూడా ఢీకొంది. ఇది గమనించిన పైలట్ వెంటనే విమానాన్ని సురక్షితంగా విమానాశ్రయంలో దింపేశారు. అనంతరం ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానానికి చేర్చారు. ఘటనపై విమానయాన సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులకు అసౌకర్యం కలిగినందుకు క్షమాపణలు చెప్పింది.
మరోవైపు, ఘటనపై అమెరికా పౌర విమానయాన నియంత్రణ సంస్థ (ఎఫ్ఏఏ) దర్యాప్తునకు ఆదేశించింది. అయితే, వారం క్రితం సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ దాదాపు ఇదే ఇబ్బందిని ఎదుర్కొంది. టెక్సాస్ నుంచి బయలుదేరాల్సిన ఓ విమానంలో చివరి నిమిషంలో ఇంజెన్‌లో మంటలు రేగడంతో విమాన సర్వీసును రద్దు చేయాల్సి వచ్చింది. రెండు ప్లేన్లు బోయింగ్‌కు చెందినవే. ఈ నేపథ్యంలో రెండు ఘటనలపైనా ఎఫ్ఏఏ దృష్టి సారించింది.