Aditya L1: నేడు సంపూర్ణ సూర్యగ్రహణం.. బంధించలేకపోతున్న మన ‘ఆదిత్య ఎల్1’.. కారణం ఇదే!
- ఉత్తర అమెరికాలోని చాలా ప్రాంతాల్లో కనిపించనున్న సూర్య గ్రహణం
- గ్రహణ వీక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు
- గ్రహణ సమయంలో పరిశోధనలు చేస్తున్న నాసా
- గ్రహణాలతో సంబంధం లేని ప్రదేశంలో ఇస్రో పంపిన ఆదిత్య ఎల్1 ఉపగ్రహం
- సూర్యుడిని 365 రోజులు క్షణం కూడా వదలకుండా పరిశీలిస్తున్న ‘ఆదిత్య’
ఆదిత్యుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇటీవల ‘ఆదిత్య ఎల్1’ ఉపగ్రహాన్ని పంపింది. సుదీర్ఘ ప్రయాణం తర్వాత లాగ్రాంజ్ పాయింట్ 1 (ఎల్ 1 పాయింట్)కు చేరుకున్న ఉపగ్రహం సూర్యుడిపై పరిశోధనలు కొనసాగిస్తోంది. అయితే, ఇది నేటి సూర్యగ్రహణానికి మాత్రం సాక్షీభూతంగా నిలవలేకపోతున్నది. నేటి సంపూర్ణ సూర్యగ్రహం మనకు కనిపించనప్పటికీ ఉత్తర అమెరికాలోని చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ అపురూప ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు స్కైడైవింగ్ నుంచి ప్రత్యేక విమానాల వరకు అనేక కార్యక్రమాలను యూఎస్‌లో నిర్వహిస్తున్నారు. దాదాపు ఒక శతాబ్దం తర్వాత తొలిసారి న్యూయార్క్ రాష్ట్రంలోని పశ్చిమ, ఉత్తర ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతోంది.
పగలు రాత్రయ్యేది పది నిమిషాలే
సూర్యగ్రహణం సందర్భంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ మరిన్ని పరిశోధనలకు రెడీ అయింది. ప్రత్యేక రీసెర్చ్ విమానాల ద్వారా ప్రయోగాలు చేపట్టింది. సూర్యగ్రహణం కొన్ని గంటలపాటు కొనసాగనున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణమే అయినప్పటికీ, కొన్ని గంటలపాటు ఇది కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ పగలు రాత్రిగా మారే అద్భుత దృశ్యం మాత్రం నాలుగు నిమిషాల్లోనే ముగుస్తుంది.
ఆదిత్య ఎల్1కు సూర్యగ్రహణం కనిపించదా?
భారత్ పంపిన ఆదిత్య ఎల్1 ఉపగ్రహం ఈ అపురూప ఘట్టానికి సాక్షిగా నిలవలేకపోతున్నది. అయితే, ఇది ఇస్రో చేసిన తప్పు కాదు. దీని వెనక ఓ కారణం కూడా ఉంది. ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని ఇస్రో సూర్యుడిపై ప్రయోగాలకు ఎలాంటి ఆటంకం కలగని ప్రదేశంలో ఉంచింది. అంటే ఇది 24x7, 365 రోజులు నిరంతరాయంగా పనిచేస్తుందన్నమాట. గ్రహణాలు ఏర్పడితే ఆ ప్రభావం ఉపగ్రహంపై పడకుండా శాటిలైట్ వీక్షణ క్షణం కూడా నిరోధించబడని ప్రదేశాన్ని శాస్త్రవేత్తలు ఎంచుకున్నారు. కాబట్టి ఆదిత్య ఎల్1 సూర్యగ్రహణాన్ని చూడలేదు. చంద్రుడు అంతరిక్ష నౌక వెనక ఉండడం వల్ల భూమిపై కనిపించే గ్రహణానికి లాగ్రాంజ్ పాయింట్ పెద్దగా ప్రాముఖ్యం ఉండదని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు.
1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలోని హాలో కక్ష్యలో
ఆదిత్య ఎల్1 అంతరిక్ష నౌక భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో లాగ్రాంజ్ పాయింట్ 1 చుట్టూ ఒక హాలో కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఇక్కడి నుంచి సూర్యుడిని నిరంతరం వీక్షించవచ్చు. గ్రహణాలు కూడా దీనికి అడ్డంరావు. దీనివల్ల సౌర కార్యకలాపాలను , అంతరిక్ష వాతావరణంపై దాని ప్రభావాన్ని వాస్తవ సమయంలో గమనించవచ్చు. ఆదిత్య ఎల్1 లాగ్రాంజ్ పాయింట్లో ఉంది కాబట్టే అది సూర్య గ్రహణాన్ని ఒడిసిపట్టుకోలేకపోతోందన్నమాట.