Raghunandan Rao: ఎన్నికల వేడి: హరీశ్ రావు, రఘునందన్ రావు మధ్య మాటల యుద్ధం
- రఘునందన్ రావు ఎన్నో హామీలు ఇచ్చి దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచారన్న హరీశ్ రావు
- ఆ తర్వాత హామీలను అమలు చేయలేదని మండిపాటు
- మాట తప్పినందుకే ఆయనను దుబ్బాక ప్రజలు ఓడించారని వ్యాఖ్య
- వెంకట్రామిరెడ్డి కలెక్టర్‌గా ఉన్నప్పుడు ప్రజలను దోచుకున్నారన్న రఘునందన్ రావు
మెదక్ లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావు, మెదక్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మధ్య మాటల యుద్ధం సాగుతోంది. దుబ్బాకలో చెల్లని రూపాయి మెదక్‌లో చెల్లుతుందా? అని హరీశ్ రావు ప్రశ్నిస్తే... సిద్దిపేటలో ఓటుకు రూ.2వేలు ఇచ్చి గెలిచారని రఘునందన్ రావు ఆరోపించారు.
ఎన్నో హామీలు ఇచ్చి గెలిచాక... అమలు చేయలేదు: హరీశ్ రావు
రఘునందన్ రావు ఎన్నో హామీలు ఇచ్చి దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచారని హరీశ్ రావు అన్నారు. కానీ తర్వాత హామీలను అమలు చేయలేదని మండిపడ్డారు. మాట తప్పినందుకే ఆయనను దుబ్బాక ప్రజలు ఓడించారన్నారు. దుబ్బాకలో ఓడిన వ్యక్తిని మళ్లీ మెదక్ ప్రజలు ఎలా ఆదరిస్తారని ప్రశ్నించారు. ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని... మరి ఈ పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా? అని నిలదీశారు. అలాగే హరీశ్ రావు కాంగ్రెస్ పార్టీపై కూడా నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. నిరుద్యోగ భృతి హామీ ఇవ్వలేదని అప్పుడే కాంగ్రెస్ మాట మార్చిందన్నారు.
హరీశ్ రావు, వెంకట్రామిరెడ్డిలపై రఘునందన్ ఆగ్రహం
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో ఓటుకు రూ.2వేలు ఇచ్చి హరీశ్ రావు గెలిచారని ఆరోపించారు. వెంకట్రామిరెడ్డి కలెక్టర్‌గా ఉన్నప్పుడు ప్రజలను దోచుకున్నారని మండిపడ్డారు. వెంకట్రామిరెడ్డి నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగులతో సమావేశమయ్యారని, దీనిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. పోలీసులు తన ఫిర్యాదుపై ఆయనకు సమాచారం ఇచ్చారన్నారు. ఈ విషయం తెలియగానే ఆయన ఫంక్షన్ హాలు గేట్లు మూసి, లైట్లు బంద్ చేశారన్నారు. సమావేశం ముగిసిన తర్వాత పోలీసులు అక్కడకు చేరుకున్నారన్నారు.