Krosuru TDP Office: క్రోసూరు టీడీపీ కార్యాలయానికి అర్ధరాత్రి నిప్పుపెట్టిన వైనం... మండిపడిన చంద్రబాబు, నారా లోకేశ్
- మొన్న క్రోసూరులో చంద్రబాబు ప్రజాగళం సభ
- అర్ధరాత్రి వేళ టీడీపీ ఆఫీసుకు నిప్పుపెట్టారన్న చంద్రబాబు
- అధికారం పోతోందని వైసీపీ రౌడీమూకలకు నిద్రపట్టలేదని విమర్శలు
- క్రోసూరులో వైసీపీ ఉన్మాదం కట్టలు తెంచుకుందన్న నారా లోకేశ్
పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో టీడీపీ ఆఫీసుకు నిప్పుపెట్టిన ఘటనపై పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం పోతుందని తెలిసి వైసీపీ రౌడీమూకలకు నిద్రపట్టలేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. అర్ధరాత్రి వేళ టీడీపీ కార్యాలయానికి నిప్పుపెట్టారని పేర్కొన్నారు. క్రోసూరు ప్రజాగళం సభకు వచ్చిన స్పందన చూసి ఓర్వలేకపోయారని చంద్రబాబు విమర్శించారు. రౌడీయిజం, విధ్వంసం ఇదే వైసీపీ నైజం... ప్రజలంతా ఏకమైన వైసీపీ రౌడీలను తరిమికొట్టాలి అని పిలుపునిచ్చారు.
టీడీపీ క్యాడర్ సహనాన్ని చేతగానితనంగా భావించవద్దు: నారా లోకేశ్
క్రోసూరు టీడీపీ ఆఫీసుకు నిప్పుపెట్టిన ఘటనపై లోకేశ్ తీవ్రస్థాయిలో స్పందించారు. టీడీపీ సభలకు వస్తున్న ప్రజాస్పందన చూసి భరించలేకపోతున్నారని విమర్శించారు. "క్రోసూరులో వైసీపీ ఉన్మాదం కట్టలు తెంచుకుంది. టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టి రాక్షసానందం పొందారు. ఎన్నికల్లో గెలవడం అసాధ్యమని వైసీపీ నేతలకు తెలిసింది. దాడులు, విధ్వంసంతో ప్రజా తీర్పును మార్చలేరు. ప్రజలు వైసీపీని బంగాళాఖాతంలో కలపబోతున్నారు. టీడీపీ క్యాడర్ సహనాన్ని చేతగానితనంగా భావించవద్దు. క్రోసూరు ఘటనకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి" అని డిమాండ్ చేశారు.