Supreme Court: ఎన్నికలకు ముందు ఎంతమందినని జైల్లో పెడతారు?: సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు
- తమిళనాడు ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన యూట్యూబర్ బెయిల్‌ను పునరుద్ధరించిన న్యాయస్థానం
- ఆరోపణలు చేయకుండా నిలువరించాలన్న సీఎం స్టాలిన్ అభ్యర్థనను తోసిపుచ్చిన బెంచ్
- ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేస్తారా అని ప్రశ్న
ఎన్నికలకు ముందు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై ఆరోపణలు చేసే ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసుకుంటూపోతే ఎంతమందినని జైల్లో పెడతారని తమిళనాడు ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఆయన ప్రభుత్వంపై గతంలో కించపరిచే వ్యాఖ్యలు చేసిన దురైమురుగన్ సత్తాయ్ అనే ఓ యూట్యూబర్ బెయిల్‌ను పునరుద్ధరించిన సందర్భంలో సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. నిందితుడిగా ఉన్న సత్తాయ్ రాజ్యాంగం తనకు కల్పించిన స్వేచ్ఛను దుర్వినియోగపరిచారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన బెంచ్ కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తి ప్రభుత్వంపై అపవాదు మోపారని ఎవరు నిర్ణయిస్తారని ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని జస్టిస్ ఓకా ప్రశ్నించారు.
బెయిల్‌పై ఉన్న దురైమురుగన్ సత్తాయ్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయకుండా షరతు విధించాలంటూ సీఎం స్టాలిన్ అభ్యర్థించినప్పటికీ సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. బెయిల్‌పై ఉన్న సమయంలో నిందితుడు ప్రభుత్వంపై మరిన్ని ఆరోపణలు చేస్తున్నాడని స్టాలిన్ ప్రస్తావించినప్పటికీ లెక్కలోకి తీసుకోలేదు. కాగా సీఎం స్టాలిన్ అభ్యర్థనను పరిశీలించి మద్రాస్ హైకోర్టు యూట్యూబర్ సత్తాయ్ బెయిల్‌ను రద్దు చేసింది. రెండు ఎఫ్ఐఆర్లు నమోదవడంతో బెయిల్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని సత్తాయ్ సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో సర్వోన్నత న్యాయస్థానం తాజా ఆదేశాలు వచ్చాయి. ఆగస్టు 2021లో ఇచ్చిన బెయిల్‌ను కొనసాగించనున్నట్టు సుప్రీంకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. కాగా సత్తాయ్ నాటి నుంచి రెండున్నరేళ్లపాటు బెయిల్‌పైనే ఉండడం గమనార్హం.
ప్రభుత్వ వాదనను సమర్థిస్తూ సత్తాయ్‌పై డిసెంబర్ 2022, మార్చి 2023లో రెండు ఎఫ్ఐఆర్లను నమోదయ్యాయని న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. కాగా లోక్‌సభ ఎన్నికల వేళ ఈ తీర్పు వెలువడడం గమనార్హం.