Heritage Foods: పత్రాల దహనం: సీఐడీ అదనపు ఎస్పీకి హెరిటేజ్ సంస్థ లేఖ
- తాడేపల్లి సిట్ కార్యాలయం వద్ద పత్రాల దహనం
- హెరిటేజ్ పత్రాలేనంటూ మీడియాలో కథనాలు
- తాము సీఐడీకి అందించిన పత్రాలు ఎంతో ప్రాధాన్యత ఉన్న పత్రాలు అని హెరిటేజ్ వెల్లడి
- కీలక పత్రాల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన హెరిటేజ్ సంస్థ కార్యదర్శి
తాడేపల్లి సిట్ కార్యాలయం వద్ద పత్రాల దహనం వ్యవహారాన్ని హెరిటేజ్ సంస్థ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ క్రమంలో, సీఐడీ అదనపు ఎస్పీకి హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ సెక్రటరీ ఉమాకాంత్ బారిక్ లేఖ రాశారు.
హెరిటేజ్ పత్రాల దగ్ధంపై మీడియాలో వచ్చిన కథనాలను తన లేఖలో ఆయన ప్రస్తావించారు. తమ సంస్థకు చెందిన ఒరిజినల్ డాక్యుమెంట్లు, మినిట్ బుక్స్ ను సీఐడీ అధికారులకు ఇచ్చిన విషయాన్ని హెరిటేజ్ ఫుడ్స్ కార్యదర్శి లేఖలో కూడా పొందుపరిచారు.
తాము అందించిన పత్రాలు చాలా కీలకమైనవని స్పష్టం చేశారు. సీఐడీకి సహకరించడమే కాకుండా, న్యాయబద్ధులమై ఉంటామని... ఇదే సమయంలో డాక్యుమెంట్ల భద్రత కూడా అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న అంశమని పేర్కొన్నారు.
మీడియాలో వస్తున్న కథనాలు చూస్తుంటే, సీఐడీ అధీనంలో ఉన్న పత్రాల భద్రతను ప్రశ్నార్థకం చేసేలా ఉన్నాయని ఉమాకాంత్ బారిక్ ఆందోళన వ్యక్తం చేశారు. తమ డాక్యుమెంట్లు ఎంతో ప్రాధాన్యత ఉన్నవని, దీనిపై తమకు పూర్తిస్థాయి వివరాలు ఇవ్వాలని సీఐడీకి విజ్ఞప్తి చేశారు.