Krishna River: కృష్ణా జలాల వివాదంలో వివరణ దాఖలుకు సమయం కోరిన ఏపీ... తోసిపుచ్చిన ట్రైబ్యునల్
- తెలుగు రాష్ట్రాల మధ్య సుదీర్ఘకాలంగా కృష్ణా జలాల వివాదం
- వివరణ ఇచ్చేందుకు జూన్ వరకు గడువు కోరిన ఏపీ
- ఈ నెల 29 లోగా వివరణ ఇవ్వాలన్న ట్రైబ్యునల్
- తదుపరి విచారణ మే 15కి వాయిదా
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల విషయంలో నెలకొన్న వివాదంలో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. కృష్ణా జలాల వివాదంలో వివరణ దాఖలుకు గడువు కావాలని ఏపీ ప్రభుత్వం కోరగా, కృష్ణా ట్రైబ్యునల్ నిరాకరించింది. జూన్ వరకు సమయం ఇవ్వాలని ఏపీ చేసిన విజ్ఞప్తిని ట్రైబ్యునల్ తోసిపుచ్చింది.
కృష్ణా నదీ జలాల విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య చాలాకాలంగా వివాదం ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కృష్ణా జలాల వివాదంలో పూర్తి వివరణకు మరికొంత సమయం పడుతుందన్న ఏపీ ప్రభుత్వం ఆ మేరకు గడువు కోరుతూ దరఖాస్తు చేసింది. రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండడంతో జూన్ వరకు గడువు కోరింది.
ఏపీ దరఖాస్తుపై కృష్ణా ట్రైబ్యునల్ విచారణ జరిపింది. కాగా, ఏపీ గడువు కోరడంపై తెలంగాణ సర్కారు అభ్యంతరం వ్యక్తం చేసింది. పెండింగ్ వ్యవహారాలకు ఎన్నికల కోడ్ అడ్డంకి కాదని స్పష్టం చేసింది. కాలయాపన కోసమే ఏపీ గడువు కోరుతోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది.
వాదనలు విన్న కృష్ణా ట్రైబ్యునల్ జూన్ వరకు గడువు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ నెల 29 లోగా వివరణ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్టేట్ మెంట్ ఇచ్చాక రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేసుకోవచ్చని రెండు రాష్ట్రాలకు స్పష్టం చేసింది. అనంతరం, తదుపరి విచారణను మే 15కి వాయిదా వేసింది.