Devineni Uma: సీఐడీ చీఫ్ రఘురామ్ రెడ్డి ఆదేశాలతోనే హెరిటేజ్ ఫైల్స్ తగలబెట్టారు: దేవినేని ఉమ
- సీఐడీ కార్యాలయంలో కొన్ని పత్రాలను తగులబెట్టిన అధికారులు
- రాష్ట్ర ఎన్నికల అధికారికి టీడీపీ ఫిర్యాదు
- లక్షల కోట్ల కుంభకోణాలకు సంబంధించిన ఫైల్స్ ను తగలబెట్టబోతున్నారన్న ఉమ
సిట్ కార్యాలయంలో కొన్ని పత్రాలను సీఐడీ అధికారులు కాల్చి వేసిన ఘటన ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ ఘటనపై ఈసీకి టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య తదితరులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమ ఎక్స్ వేదికగా స్పందిస్తూ... సీఐడీ అధికారి కొల్లి రఘురామ్ రెడ్డి ఆదేశాలతోనే తగలబెట్టించారని ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరపాలని కోరామని చెప్పారు. సీఐడీ చీఫ్ రఘురామ్ రెడ్డి నిస్సిగ్గుగా ఇచ్చిన వివరణ కాపీ రాష్ట్ర ప్రజానీకాన్ని నివ్వెర పరిచిందని అన్నారు.
జగన్ కళ్లల్లో ఆనందం చూడటానికి సీఐడీ చీఫ్ అత్యుత్సాహం ప్రదర్శించారని విమర్శించారు. ఘటనపై విచారణ చేయించాలని కోరడం జరిగిందని చెప్పారు. రికార్డుల ప్రకారం ఏది చేయాలన్నా ఒక పబ్లిక్ రికార్డు ఆఫీసర్ ఉంటారని... రఘురామ్ రెడ్డి అత్యుత్సాహం ఇప్పుడు సదరు అధికారికి చుట్టుకుందని అన్నారు. సీఐడీ చీఫ్ ఆయన తీసిన గోతిలో ఆయనే పడ్డారని చెప్పారు.
ల్యాండ్, శాండ్, మైన్, సెంటు పట్టాల భూములు, ఇసుక కుంభకోణాలు, మద్యం డిజిటల్ పేమెంట్లలో లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయని... ఆ ఫైల్స్ అన్నింటినీ తగలబెట్టబోతున్నారని చెప్పారు. ఈరోజు తగలబెట్టిన ఫైల్స్ లో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే పెట్టిన ఫైల్స్ కూడా స్పష్టంగా కనపడ్డాయని తెలిపారు. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి తెలిపామని చెప్పారు. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయం మీద, చంద్రబాబు నాయుడు ఇంటి మీద జరిగిన దాడికి సంబంధించి ఈరోజు వరకు ఒక్క నిందితుడిని కూడా అరెస్ట్ చేయలేదని మండిపడ్డారు.