New Zealand: ముంచెత్తుతున్న వలసల నేపథ్యంలో.. న్యూజిలాండ్ వీసా నిబంధనలలో భారీ మార్పులు!
- న్యూజిలాండ్‌కు తలనొప్పిగా మారిన భారీ వలసలు
- ఉపాధి వీసా నిబంధనలలో తక్షణమే మార్పులు చేపడుతున్నట్లు ప్రకటన
- గతేడాది ఆ దేశానికి ఏకంగా 1.73 లక్షల మంది వలస వెళ్లిన వైనం
- నిరంతర నివాస గడువును 5 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు తగ్గించాలని న్యూజిలాండ్ నిర్ణయం
న్యూజిలాండ్‌కు భారీగా పెరిగిన వలసలు తలనొప్పిగా మారాయి. దీంతో చేసేదేమిలేక వీసా నిబంధనలు కఠినతరం చేసింది. ప్రధానంగా ఉపాధి వీసా నిబంధనల విషయంలో తక్షణమే మార్పులు చేపడుతున్నట్లు న్యూజిలాండ్ సర్కార్ వెల్లడించింది. 2023లో ఇతర దేశాల నుంచి న్యూజిలాండ్‌కు ఏకంగా 1.73 లక్షల మంది వలస వెళ్లినట్లు తెలిసింది. కరోనా తర్వాత ఆ దేశంలోకి వలసలు విపరీతంగా పెరిగాయి.
ఇలా వలసలు భారీగా పెరగడంతో ఆందోళన వ్యక్తం చేసిన ప్రభుతం ఇప్పుడు వాటిని నియంత్రించే పనిలో పడింది. ఇకపై పెద్దగా నైపుణ్యం అవసరం లేని పనుల కోసం వచ్చేవారికి కూడా ఇంగ్లీష్ భాష పరిజ్ఞానం, ఉద్యోగ వీసాల విషయంలో కనీస నైపుణ్యాలు, పని అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవడం వంటి కొత్త మార్పులను అనుసరించేందుకు సిద్ధమైంది.
అలాగే తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగాల్లో ఉన్నవారికి స్థానికంగా నిరంతర నివాస గడువును 5 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు తగ్గించాలని న్యూజిలాండ్ నిర్ణయించింది. ఇక సెకండరీ టీచర్లు వంటి అత్యంత నైపుణ్యం కలిగిన వలసదారులను ఆకర్షించడం, అటువంటివారు ఇక్కడే కొనసాగేలా చూడటంపై కూడా దృష్టిసారించినట్లు ఆ దేశ వలసల శాఖ మంత్రి ఎరికా స్టాన్ఫోర్డ్ వెల్లడించారు.
అదే సమయంలో నైపుణ్యాల కొరత లేని ఉద్యోగాల విషయంలో తమ దేశవాసులు ముందు వరుసలో ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. మరోవైపు కరోనా తర్వాత వలసలు భారీగా పెరగడంతో న్యూజిలాండ్ జనాభా ప్రస్తుతం 51 లక్షలకు చేరింది. ఈ నేపథ్యంలోనే గతేడాది ఆ దేశం ద్రవ్యోల్బణం పరిస్థితులను ఎదుర్కొంది. అటు పక్కనే ఉండే ఆస్ట్రేలియాలో కూడా ఇదే పరిస్థితి. దీంతో ఆసీస్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే రెండేళ్లలో వలసదారుల సంఖ్యను సగానికి తగ్గించాలని నిర్ణయించింది.