Indian Student: అమెరికాలో కనిపించకుండా పోయిన హైదరాబాదీ విద్యార్థి అర్ఫాత్ మృతి
- కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన అర్ఫాత్
- హైదరాబాద్ లోని పేరెంట్స్ కు బెదిరింపు కాల్స్
- అర్ఫాత్ కిడ్నాప్.. 1200 డాలర్లు ఇవ్వాలని డిమాండ్
- తాజాగా క్లీవ్ లాండ్ లో డెడ్ బాడీ గుర్తింపు
అమెరికాలో మన విద్యార్థి మరొకరు చనిపోయారు. ఎంఎస్ చేయడానికి వెళ్లిన హైదరాబాదీ యువకుడు అర్ఫాత్ మృతదేహాన్ని క్లీవ్ లాండ్ పోలీసులు గుర్తించారు. ఈమేరకు హైదరాబాద్ లోని పేరెంట్స్ కు న్యూయార్క్ లోని భారతీయ ఎంబసీ సమాచారం అందించింది. అర్ఫాత్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతూ ట్వీట్ చేసింది. ఈ అనుమానాస్పద మరణంపై పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారని, వారితో నిత్యం టచ్ లో ఉంటామని ఎంబసీ అధికారులు పేర్కొన్నారు. కాగా, అర్ఫాత్ మరణంతో అమెరికాలో ఈ ఏడాది చనిపోయిన మన విద్యార్థుల సంఖ్య పదకొండుకు చేరింది.
మహమ్మద్ అబ్దుల్ అర్ఫాత్ ఎంఎస్ చదివేందుకు గతేడాది అమెరికా వెళ్లాడు. ఓహియోలోని క్లీవ్ లాండ్ వర్సిటీలో చేరి విద్యాభ్యాసం చేస్తున్నాడు. మూడు వారాల నుంచి అర్ఫాత్ కనిపించడంలేదని, ఫోన్ కూడా చేయలేదని హైదరాబాద్ లోని ఆయన తల్లిదండ్రులు పేర్కొన్నారు. తోటి విద్యార్థుల సాయంతో క్లీవ్ లాండ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఇటీవల తన కొడుకును కిడ్నాప్ చేశామని, 1200 డాలర్లు చెల్లిస్తేనే విడిచిపెడతామని బెదిరింపు కాల్ వచ్చిందని అర్ఫాత్ తండ్రి చెప్పారు. ఈ విషయాన్ని న్యూయార్క్ లోని భారత రాయబార కార్యాలయం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.
అర్ఫాత్ కోసం పోలీసులు తీవ్రంగా గాలించినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. తాజాగా సోమవారం అర్ఫాత్ మృతదేహాన్ని క్లీవ్ లాండ్ లో గుర్తించినట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. అర్ఫాత్ మరణంపై క్లీవ్ లాండ్ పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారని పేర్కొంది. కాగా, ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులు అనుమానాస్పదంగా మరణించడం, హత్యకు గురికావడం ఇటీవలి కాలంలో పెరిగింది. గత కొన్ని వారాల వ్యవధిలోనే పదిమంది విద్యార్థులు ఇలా ప్రాణాలు కోల్పోయారు. అర్ఫాత్ మరణంతో ఈ సంఖ్య పదకొండుకు చేరింది. దీంతో అమెరికాలో చదువుతున్న మన విద్యార్థుల తల్లిదండ్రులలో ఆందోళన వ్యక్తమవుతోంది.