Kaile Anil Kumar: చంద్రబాబు నాపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్
- ఇటీవల కృష్ణా జిల్లా పామర్రులో చంద్రబాబు ప్రజాగళం సభ
- స్థానిక ఎమ్మెల్యే కైలే అనిల్ పై అవినీతి ఆరోపణలు
- చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడారంటూ కొట్టిపారేసిన కైలే అనిల్
టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల కృష్ణా జిల్లా పామర్రులో ప్రజాగళం సభ నిర్వహించిన సందర్భంగా, స్థానిక ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో, కైలే అనిల్ కుమార్ స్పందించారు. జగనన్న ఇళ్ల పట్టాల విషయంలో చంద్రబాబు తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.
"చంద్రబాబు ఎంత దిగజారిపోయారో చెప్పడానికి నా మీద చేసిన ఆరోపణలే నిదర్శనం. పామర్రులో నేను ఇల్లు కట్టుకున్నానని వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ లో ఆయన కట్టుకున్న ఇంట్లోని రెండు మెట్లు ఖరీదు కూడా నా ఇల్లు చేయదు. ఇక్కడి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో 200 గజాల్లో ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాను.
జగనన్న ఇళ్ల పట్టాల విషయంలో నేను అవినీతికి పాల్పడ్డానని ఒక్కరితో చెప్పించినా సరే... చంద్రబాబుకు నమస్కారం చేసి రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్లిపోతాను. మా నియోజకవర్గంలో గ్రావెల్ ఏంటో నాకర్థం కావడంలేదు. గ్రావెలే లేనప్పుడు నేను గ్రావెల్ మాఫియాను నడిపిస్తున్నానడం హాస్యాస్పదం.
మొన్న చంద్రబాబు పామర్రు వచ్చి రకరకాల విన్యాసాలు చేశారు. ఆ రోజున చంద్రబాబు గంటసేపు బస్సులోనే ఎందుకు పడుకున్నారో అడగండి. ఇక్కడి సభకు జనాలు ఎవరూ రాక, ప్రజాస్పందన లేకపోవడంతో ఆయన బస్సులోనే పడుకుని, ఆ తర్వాత మీటింగ్ కు వచ్చి ఆ ఎండలో, ఆ ఫ్రస్ట్రేషన్ లో ఏదో ఏదో మాట్లాడారు. నాకు, మా ఎంపీకి ఈసారి గతంలో కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని భావిస్తున్నాను" అంటూ కైలే అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు.