IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్‌లో చెలరేగిన నితీశ్ కుమార్ రెడ్డి.. ఇంతకీ ఈ యువ సంచలనం ఎవరంటూ నెటిజన్ల సెర్చింగ్!
- మొహాలిలో పీబీకేఎస్ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్
- ఈ మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన నితీశ్ కుమార్ రెడ్డి
- ఈ ఆంధ్రా బ్యాటర్ 37 బంతుల్లోనే ఐదు సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేసిన వైనం
- ఐపీఎల్ వేలంలో నితీశ్‌ను సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ బేస్ ధర రూ. 20 లక్షలకు కొనుగోలు
మొహాలిలో మంగళవారం పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)తో మ్యాచ్ లో యువ సంచలనం నితీశ్ కుమార్ రెడ్డి అందరి దృష్టిని ఆకర్షించాడు. 20 ఏళ్ల ఈ యువ క్రికెటర్ తన ఐపీఎల్ కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఈ ఆంధ్రా బ్యాటర్ 37 బంతుల్లో ఐదు సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేయడం విశేషం. తాను ఆడిన నాలుగో ఐపీఎల్ మ్యాచులోనే ఇలా సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. తద్వారా ఒక్కసారిగా స్టార్‌గా మారిపోయాడు. అటు హైదరాబాద్ జట్టులో తనకుంటూ ఓ గుర్తింపు ఏర్పరచుకున్నాడు.
ఆంధ్రా జట్టు నుంచి వచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి
దేశవాళీ క్రికెట్‌లో నితీశ్ కుమార్ రెడ్డి ఆంధ్రా జట్టు తరఫున ఆడుతున్నాడు. అతను మంగళవారం నాటి మ్యాచ్ కు ముందు కేవలం ఎనిమిది టీ20లు మాత్రమే ఆడాడు. ఇందులో 2023లో రెండు ఐపీఎల్ మ్యాచ్‌లు ఉన్నాయి. అందులో నితీశ్‌కి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కాగా, దుబాయి వేదికగా జరిగిన ఐపీఎల్ 2023 మినీ వేలంలో అతడిని సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ తన బేస్ ధర రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది.
ఇక ఈఎస్‌పీఎన్ క్రిక్ఇన్ఫో ప్రకారం.. నితీశ్ కుమార్ రెడ్డి ఆంధ్రా తరపున రంజీ ట్రోఫీలో ఏడు మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించాడు. ఈ మ్యాచులలో 366 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. అలాగే అండర్-19 స్థాయిలో ఇండియా-బీ తరపున ఆడిన నితీశ్ 17 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 566 పరుగులు చేశాడు. ఇక 22 లిస్ట్-ఏ మ్యాచులు ఆడి 36.63 సగటుతో 403 పరుగులు చేశాడు. అలాగే మీడియం పేస్ బౌలింగ్ వేసే నితీశ్ దేశవాళీ మ్యాచుల్లో 52 వికెట్లు తీశాడు. అందులో 5 వికెట్ల ప్రదర్శన రెండు సార్లు నమోదు చేయడం విశేషం.
నితీశ్ కుమార్ రెడ్డి కుటుంబ నేపథ్యం
ఏపీలోని విశాఖపట్నంకు చెందిన కాకి నితీశ్ కుమార్ రెడ్డి 2003, మే 26న జన్మించారు. నితీశ్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి హిందూస్తాన్ జింక్‌లో పనిచేశారు. అతనిది సాధారణ దిగువ మధ్య తరగతి కుటుంబం. నితీశ్ రెడ్డి ఐదేళ్ల వయసులోనే క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. హిందూస్తాన్ జింక్ కంపెనీ గ్రౌండ్‌లో క్రికెట్ మ్యాచ్‌లు చూస్తూ పెరిగిన అతను ప్లాస్టిక్ బాల్‌తో తన ఆటను ప్రారంభించాడు. ఆ తర్వాత తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. అయితే, ముత్యాల రెడ్డిని ఉదయ్‌పూర్ ట్రాన్స్‌ఫర్ చేయడంతో అతను కొడుకు కెరీర్ కోసం ఉద్యోగానికి రాజీనామ చేశారు.