Maharashtra: బావిలో పడిపోయిన‌ పిల్లిని ర‌క్షించ‌బోయి ఐదుగురు కుటుంబ సభ్యుల మృతి!

Five Of Family Die After Falling Into Abandoned Well In Bid To Save Cat In Maharashtra
  • మ‌హారాష్ట్ర‌లోని అహ్మ‌ద్‌న‌గ‌ర్‌లోని వాడ్కి గ్రామంలో ఘ‌ట‌న‌
  • ఒకరినొకరు రక్షించుకునే ప్రయత్నంలో ఆరుగురు బావిలోకి దూకిన వైనం
  • న‌డుముకి తాడు క‌ట్టుకుని దిగిన చివ‌రి వ్య‌క్తి సేఫ్
  • పాడుబడిన బావిని బయోగ్యాస్ కోసం ఉప‌యోగిస్తున్న‌ట్లు గుర్తించిన పోలీసులు
మ‌హారాష్ట్ర‌లో ఘోర విషాదం జ‌రిగింది. అహ్మ‌ద్‌న‌గ‌ర్‌లోని వాడ్కి గ్రామంలో పాడుబడిన బావిలో పడిన పిల్లిని రక్షించే ప్రయత్నంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కాగా, బావిని బయోగ్యాస్ కోసం ఉప‌యోగిస్తున్న‌ట్లు తెలిసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో పిల్లిని కాపాడే క్ర‌మంలో కుటుంబంలోని ఒకరు బావిలోకి దిగారు. ఆ త‌ర్వాత ఒకరినొకరు రక్షించుకునే ప్రయత్నంలో ఆరుగురు బావిలోకి దూకేశారు. అయితే, న‌డుముకి తాడు క‌ట్టుకుని దూకిన చివ‌రి వ్య‌క్తిని ర‌క్షించిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. 

అహ్మద్‌నగర్‌లోని నెవాసా పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీసు అధికారి ధనంజయ్ జాదవ్ మాట్లాడుతూ.. "పిల్లిని కాపాడే ప్రయత్నంలో బయోగ్యాస్ కోసం ఉప‌యోగిస్తున్న బావిలో ఒకరి తర్వాత ఒకరు దూకిన ఆరుగురిలో ఐదుగురి మృతదేహాలను రెస్క్యూ టీమ్ స్వాధీనం చేసుకుంది. నడుముకు తాడు కట్టుకుని బావిలోకి దిగిన ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అత‌డిని పోలీసులు రక్షించారు. సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘ‌ట‌న‌పై విచారణ జరుగుతోంది" అని పోలీసు అధికారి అన్నారు.

మృతులను మాణిక్ కాలే (65), మాణిక్ కుమారుడు సందీప్ (36), అనిల్ కాలే (53), అనిల్ కుమారుడు బబ్లూ (28), బాబాసాహెబ్ గైక్వాడ్ (36)గా గుర్తించారు. బయటకు తీసిన వ్యక్తిని మాణిక్ చిన్న కుమారుడు విజయ్ (35)గా గుర్తించారు. కాగా, ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, పూణే నుండి దాదాపు 200 కిలోమీటర్లు, అహ్మద్‌నగర్ జిల్లా కేంద్రం నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెవాసా తాలూకాలోని వాడ్కి గ్రామంలో మంగ‌ళ‌వారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ సంఘటన జరిగిన‌ట్లు తెలుస్తోంది.
Maharashtra
Cat
Abandoned Well

More Telugu News