NASA: చంద్రుడి చుట్టూ తిరుగుతున్న వింత వస్తువు... అసలు విషయం ఇదే!
- ఆసక్తికర ఫొటోలు విడుదల చేసిన నాసా
- చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తున్న సర్ఫ్ బోర్డ్ వంటి ఆకారం
- అయితే అది దక్షిణ కొరియా లూనార్ ఆర్బిటర్ 'దనురి' అని తేలిన వైనం
గ్రహాంతర వాసులు, ఫ్లయింగ్ సాసర్లు, యూఎఫ్ఓ (గుర్తుతెలియని వస్తువులు)... ఇలా అనేక అంశాలు ఎన్నో శతాబ్దాలుగా మానవాళికి మిస్టరీగా కొనసాగుతున్నాయి. అయితే ఇవి నిజంగా ఉన్నాయా, లేదా అనేది ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అంతరిక్ష పరిశోధన రంగంలో మిగతా దేశాల కంటే ఎంతో పురోగతి సాధించిన అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా కూడా దీని గురించి ఏమీ తేల్చలేకపోతోంది.
తాజాగా నాసా కొన్ని ఆసక్తికర ఫొటోలను పంచుకుంది. చంద్రుడి చుట్టూ ఓ వింత వస్తువు తిరుగుతున్నట్టుగా ఉన్న కొన్ని ఫొటోలను విడుదల చేసింది. చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తున్న ఆ వస్తువు సిల్వర్ సర్ఫ్ బోర్డ్ మాదిరిగా ఉందని నాసా వెల్లడించింది. ఈ సర్ఫ్ బోర్డ్ వంటి వస్తువును లూనార్ రికానైసెన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్ఓ) లోని కెమెరా బంధించినట్టు వివరించారు.
అయితే, ఆ తర్వాత తేలిందేమిటంటే... నాసా ఎల్ఆర్ఓ చిత్రీకరించింది వింత ఆకృతిని కాదు... దక్షిణ కొరియాకు చెందిన మరో లూనార్ ఆర్బిటర్ ను అని వెల్లడైంది. దక్షిణ కొరియా లూనార్ ఆర్బిటర్ పేరు 'దనురి'. ఇది కూడా చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తూ పరిశోధనల్లో పాలుపంచుకుంటోంది.
ఇది నాసా ఎల్ఆర్ఓకు అభిముఖ కక్ష్యలోకి రాగా, దాని ఫొటోలను నాసా ఎల్ఆర్ఓ చిత్రీకరించింది. అయితే, ఈ రెండు లూనార్ ఆర్బిటర్ ల ద్రవ్యవేగంలో భారీ తేడా ఉండడంతో... నాసా ఎల్ఆర్ఓ తీసిన ఫొటోల్లో 'దనురి' ఓ సన్నని గీత వంటి సర్ఫ్ బోర్డ్ లా దర్శనమిచ్చింది.
'దనురి'... దక్షిణ కొరియా చంద్రుడిపైకి ప్రయోగించిన తొలి స్పేస్ క్రాఫ్ట్. ఇది 2022 నుంచి చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తోంది.