Pawan Kalyan: ఇక్కడ నా జనసైనికులపై పడిన దెబ్బ నేనింకా మర్చిపోలేదు: పవన్ కల్యాణ్
- తణుకులో ప్రజాగళం సభ
- హాజరైన పవన్ కల్యాణ్
- ఆ మంత్రి పేరును నా నోటితో పలకడానికి కూడా ఇష్టపడను అంటూ వ్యాఖ్యలు
తణుకులో నిర్వహించిన ప్రజాగళం సభలో జనసేనాని పవన్ కల్యాణ్ ప్రసంగించారు. స్థానికంగా ఉన్న పౌరసరఫరాల మంత్రి పేరును కూడా నా నోటి నుంచి పలకడానికి ఇష్టపడను అంటూ పవన్ ధ్వజమెత్తారు. ఇక్కడ టీడీఆర్ బాండ్ల సొమ్ము దోచుకుని హైదరాబాద్ వెళ్లి బాలానగర్ లో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టుకున్నాడని ఆరోపించారు. ఆ మంత్రి కనీసం తన అవినీతి సొమ్మును ఈ నియోజకవర్గంలో పెట్టుబడి పెట్టినా స్థానికులకు ఉపాధి వచ్చేదని అన్నారు.
గతంలో ఇక్కడ జరిగిన తప్పులపై జనసేన రోడ్లపైకి వచ్చి పోరాడిందని పవన్ గుర్తు చేసుకున్నారు. ఇక్కడ నా జనసైనికులపై పడిన దెబ్బ నేనింకా మర్చిపోలేదు అని అన్నారు.
ఇక, అందరూ పేదల గురించి, పారిశ్రామికవేత్తల గురించి మాట్లాడుతుంటారని, కానీ మధ్య తరగతి వ్యక్తుల గురించి ఎవరూ మాట్లాడరని పవన్ పేర్కొన్నారు. అందుకే ఈ సభా ముఖంగా చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నానని, మధ్యతరగతి ప్రజలను కూడా గుర్తించాలని కోరుతున్నానని తెలిపారు.
ఏపీలో 10 పాయింట్స్ ఫార్ములాతో ప్రజల్లోకి వస్తున్నామని... చిట్టచివరి పొలానికి కూడా నీరందాలి, ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలి, రాష్ట్రం అభివృద్ధి జరగాలి అనేదే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు.
సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) ఎంత క్లిష్టమైన అంశం అయినప్పటికీ, అసెంబ్లీకి రాగానే దానిపై మాట్లాడతానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే సీపీఎస్ ను పరిష్కరించాలని ఈ సందర్భంగా కూటమి భాగస్వాములకు విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు.