Kids Electicuted: కర్నూలు జిల్లాలో ఉగాది ఉత్సవాలలో అపశ్రుతి .. 15 మంది పిల్లలకు విద్యుత్ షాక్
- చిన్నటేకూరులో ఉగాది ప్రభ లాగుతుండగా ఘటన
- హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి పిల్లల తరలింపు
- ఎమర్జెన్సీ యూనిట్ లో చేర్చి చికిత్స అందిస్తున్న వైద్యులు
కర్నూలు జిల్లాలో జరిగిన ఉగాది ఉత్సవాలల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఉగాది ప్రభ లాగుతున్న పిల్లలకు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో పదిహేను మంది చిన్నారులకు గాయాలయ్యాయి. జిల్లాలోని చిన్నటేకూరులో గురువారం ఉదయం చోటుచేసుకుందీ ప్రమాదం. వెంటనే స్పందించిన గ్రామస్థులు గాయపడ్డ చిన్నారులను హుటాహుటిన కర్నూలు జీజీహెచ్ కు తరలించారు. పిల్లలను ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. విద్యుత్ షాక్ తో గాయపడ్డ చిన్నారులలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.
కాగా, సంతోషంగా పండుగ జరుపుకుంటున్న చిన్నారులు విద్యుత్ షాక్ కు గురవడంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. అప్పటి వరకు ఆనందంతో గంతులేసిన చిన్నారులు ఇంతలోనే గాయాలపాలై ఆసుపత్రి బెడ్ మీద పడుకున్నారంటూ రోదిస్తున్నారు. విద్యుత్ షాక్ ఘటన గురించి తెలుసుకున్న స్థానిక నేతలు జీజీహెచ్ కు వచ్చి పిల్లల తల్లిదండ్రులను పరామర్శిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.