TSRTC: కండక్టర్‌పై దాడికేసులో ఇద్దరికి రెండేళ్ల జైలు.. పోలీసులకు సజ్జనార్ అభినందనలు

2 Year imprisonment for two over attacking on RTC conductor

  • ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తిస్తున్న ఇద్దరు వ్యక్తులను మందలించిన కండక్టర్
  • మద్యంమత్తులో కండక్టర్‌పై దాడి
  • తిరుగు ప్రయాణంలో మరోమారు దాడిచేసి విధులకు ఆటంకం
  • 9 ఏళ్ల తర్వాత నిందితులకు జైలుశిక్ష
  • దౌర్జన్యాలకు దిగితే పర్యవసానం ఇదేనన్న సజ్జనార్

కండక్టర్ విధులకు ఆటంకం కల్పించడమే కాకుండా అతనిపై దాడిచేసిన కేసులో ఇద్దరు వ్యక్తులకు రెండేళ్ల జైలుశిక్షతోపాటు రూ. 500 చొప్పున జరిమానా విధిస్తూ గద్వాల జిల్లా అలంపూర్ కోర్టు ఇన్‌చార్జి న్యాయాధికారి ఉదయ్‌నాయక్ నిన్న తీర్పు వెలువరించారు. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. బి.కృష్ణయ్య గద్వాల ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 15 మార్చి 2015న అలంపూర్ నుంచి కర్నూలుకు వెళ్తున్న బస్సులో విధుల్లో ఉన్నారు. 

అలంపూర్ వద్ద తాగిన మత్తులో బస్సెక్కిన చాకలి శ్రీనివాస్, గోపి డోర్ వద్ద నిల్చుని అసభ్యంగా ప్రవర్తించారు. బస్సెక్కే ప్రయాణికులను అసభ్యంగా తాకడం, ఉమ్మి వేయడం చేస్తుండడంతో గమనించిన కండక్టర్ కృష్ణయ్య మందలించారు. దీంతో వారు ఆయనపై దాడికి దిగారు. తిరుగు ప్రయాణంలో మళ్లీ వారు అదే బస్సు ఎక్కి కండక్టర్ విధులకు ఆటంకం కల్పించారు. కృష్ణయ్య ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితులను అరెస్ట్ చేశారు. 

తాజాగా ఈ కేసులో తుదితీర్పు వెలువడింది. నిందితులిద్దరినీ దోషులుగా తేల్చిన కోర్టు చెరో రెండేళ్ల జైలుశిక్ష, చెరో రూ. 500 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతా ద్వారా పంచుకున్నారు. ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే సంస్థ సహించదని పేర్కొన్నారు. దాడులు, దౌర్జన్యాలకు దిగితే బాధ్యులపై ఇలా చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరిస్తూ ఓ దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని షేర్ చేశారు.

  • Loading...

More Telugu News