Biryani Orders: రంజాన్ మాసంలో హైదరాబాదులో 10 లక్షల బిర్యానీ ఆర్డర్లు!: స్విగ్గీ వెల్లడి
- నగరంలో బిర్యానీకి భలే గిరాకీ
- సాయంత్రం పూట పెరిగిన ఆర్డర్లు
- ఉపవాస దీక్ష విరమణకు ఆన్ లైన్ ఆర్డర్లకే మొగ్గు
రంజాన్ మాసంలో హైదరాబాదీలు బిర్యానీ బాగా లాగించారట.. ఒక్క నెలలోనే ఏకంగా పది లక్షల బిర్యానీ ఆర్డర్లు వచ్చాయని ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ వెల్లడించింది. బిర్యానీ ఆర్డర్లలో దేశవ్యాప్తంగా హైదరాబాద్ టాప్ లో నిలిచిందని పేర్కొంది. బిర్యానీతో పాటు హలీమ్ ఆర్డర్లలోనూ సిటీవాసులు రికార్డు సృష్టించారని, నెల రోజుల వ్యవధిలో 5.3 లక్షల ఆర్డర్లు డెలివరీ చేశామని తెలిపింది. దేశవ్యాప్తంగా చూస్తే రంజాన్ నెలలో 60 లక్షల బిర్యానీ ఆర్డర్లు వచ్చాయని వివరించింది. మిగతా నెలలతో పోలిస్తే రంజాన్ నెలలో బిర్యానీ ఆర్డర్లు 15 శాతం పెరిగాయని స్విగ్గీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
మిగతా ఆహార పదార్థాలకు కూడా ఆర్డర్లు గణనీయంగా పెరిగాయని స్విగ్గీ తెలిపింది. సమోసాలు, భాజియా, మల్పువా, ఫిర్ని, రబ్ది తదితర వంటకాలు కూడా రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయని చెప్పింది. హలీమ్ ఆర్డర్లలో ఏకంగా 1454.88 శాతం పెరుగుదల నమోదైందని, దీని తర్వాతి స్థానంలో ఫిర్ని ఆర్డర్లలో 80.97 శాతం పెరుగుదల కనిపించిందని వివరించింది. మాల్పువా ఆర్డర్లు 79.09 శాతం, ఫలుదా 57,93 శాతం, డేట్స్ 48.40 శాతం ఆర్డర్లు పెరిగాయని పేర్కొంది. రంజాన్ ఉపవాసం కారణంగా సాయంత్రంపూట ఆర్డర్ల రద్దీ ఎక్కువగా ఉందని, ఇఫ్తార్ ఆర్డర్లు 34 శాతం పెరిగాయని వివరించింది. అంటే ఉపవాస దీక్ష విరమించే క్రమంలో చాలామంది స్విగ్గీ ఆర్డర్లకే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.