Chandrababu: వైసీపీ గెలుస్తుందంటూ ఈటీవీ పేరుతో ఫేక్ వీడియో... తీవ్రంగా ఖండించిన చంద్రబాబు
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
- కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక చెప్పిందంటూ ప్రచారం
- వైసీపీ ఓటమి ఖాయమని తెలియడంతో పైకి ఫేక్ పరిశ్రమను తెరపైకి తెచ్చిందన్న చంద్రబాబు
"ఏపీ ఎన్నికలపై సంచలన రిపోర్ట్ విడుదల చేసిన ఇంటెలిజెన్స్ బ్యూరో... ఏపీలో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని వెల్లడి... 124 సీట్లతో రెండోసారి కూడా వైసీపీ అధికారంలోకి వస్తుందన్న నిఘా సంస్థ... ఎన్డీయే కూటమి 51 సీట్లకే పరిమితం అవుతుందన్న ఇంటెలిజెన్స్ బ్యూరో... గత నెలలో 175 నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ... వైసీపీ గెలుపు ఖాయం కావడంతో ప్రచారానికి దూరంగా కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యనేతలు?"... అంటూ ఈటీవీ న్యూస్ చానల్ పేర్కొన్నట్టుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఫేక్ వీడియో అని ఈటీవీ ఇప్పటికే ఖండించింది.
తాజాగా ఇదే అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. టీడీపీ నేతలతో చంద్రబాబు ఇవాళ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఫేక్ పరిశ్రమను వైసీపీ తెరపైకి తెచ్చిందని అన్నారు. జగన్ ను ఇంటికి పంపాలని ప్రజలు నిర్ణయించడంతో ఫేక్ పరిశ్రమను ఆశ్రయించారని విమర్శించారు.
ఈ ఫేక్ పరిశ్రమలో భాగంగా తప్పుడు వీడియోలతో గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఈటీవీ విశ్వసనీయత దెబ్బతీసేలా ఆ చానల్ పేరుతో ఫేక్ వీడియోలు సృష్టిస్తున్నారని, ప్రజలు నమ్మే న్యూస్ చానల్ పేరుతో తప్పుడు వీడియోలు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాంటి ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తే ప్రజలు నమ్మేస్తారనే దుస్థితికి దిగజారారని విమర్శించారు. ఫేక్ ప్రచారం కోసం వీళ్లు కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోను కూడా వదల్లేదని అన్నారు. వైసీపీ ఫేక్ ప్రచారాలను దీటుగా తిప్పికొట్టాలని చంద్రబాబు టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సూపర్-6 పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు.
ఇక, వాలంటీర్లతో తప్పుడు పనులు చేయించి జైలుకు పంపాలని చూస్తున్నారు, వాలంటీర్లను బానిసలుగా మార్చి ఊడిగం చేయించుకుంటున్నారని ధ్వజమెత్తారు. వాలంటీర్లకు రూ.10 వేల జీతం ఇస్తామంటే తట్టుకోలేకపోతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
వైసీపీ దాడులను సమర్థంగా తిప్పికొట్టాలని, కూటమిలో ఏ పార్టీ అభ్యర్థికి అయినా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఓట్లు పడేలా నాయకులు కృషి చేయాలని సూచించారు.