Devineni Uma: తాడేపల్లిలోని నెక్ట్స్ స్పేస్ భవనం నుంచే ఫేక్ వార్తలు బయటికి వస్తున్నాయి: దేవినేని ఉమా

Devineni Uma fires on fake news

  • ఈటీవీ పేరుతో ఫేక్ న్యూస్ వైరల్
  • మండిపడుతున్న టీడీపీ నేతలు
  • తప్పుడు ప్రచారంతో సజ్జల విషం చిమ్మేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఉమా
  • సజ్జల కుమారుడు భార్గవ నేతృత్వంలో ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నడుస్తోందని ఆరోపణ

టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ధ్వజమెత్తారు. ఓడిపోతామన్న భయంతోనే సజ్జల... చంద్రబాబుపై పడి ఏడుస్తున్నారని విమర్శించారు. తప్పుడు ప్రచారాలతో విషం చిమ్మేందుకు సజ్జల యత్నిస్తున్నారని మండిపడ్డారు. 

తాడేపల్లి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి తప్పుడు ప్రచారం జరుగుతోందని ధ్వజమెత్తారు. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లో 300 మంది పనిచేస్తున్నారని, వారంతా ప్రభుత్వ జీతం తీసుకుంటున్నారని దేవినేని ఉమా వెల్లడించారు. సజ్జల కుమారుడు భార్గవ నేతృత్వంలోనే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నడుస్తోందని ఆరోపించారు. 

తాడేపల్లిలోని నెక్ట్స్ స్పేస్ భవనం నుంచే ఫేక్ వార్తలు సృష్టిస్తున్నారని వివరించారు. ఇంటెలిజెన్స్ బ్యూరో అంటూ ఫేక్ లోగోలు రూపొందిస్తున్నారని, దీనిపై ఏపీ డిజిటల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోదాలు చేయాలని ఉమా డిమాండ్ చేశారు. ఫేక్ ప్రచారంపై డీజీపీ, ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. 

ఇంటెలిజెన్స్ బ్యూరోకి చెందిన ఫేక్ లోగోలనే సృష్టించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలని అన్నారు. వైసీపీ కార్యకర్తల సాయంతో ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నడిపిస్తూ... టీడీపీ, జనసేన, బీజేపీపై తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. తప్పుడు వార్తలపై ఈ సాయంత్రం డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఫేక్ న్యూస్ అంశాన్ని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి దృష్టికి కూడా తీసుకెళతామని ఉమా వెల్లడించారు. పోలీసులకు తగిన ఆదేశాలు ఇచ్చి చర్యలు తీసుకోవాలని కోరతామని తెలిపారు. 

ఇక, రాష్ట్రంలో తప్పులు చేస్తున్న అధికారులు మూల్యం చెల్లించుకుంటారని దేవినేని ఉమా హెచ్చరించారు. ఎన్నికల కోడ్ కాకుండా, వైసీపీ కోడ్ అమలు చేస్తే తగిన ఫలితాలను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఒక ఐజీని, ముగ్గురు కలెక్టర్లను ఇప్పటికే ఎన్నికల బాధ్యతల నుంచి తొలగించారని ఉమా గుర్తుచేశారు. 

సీఐడీ, సిట్ కార్యాలయాల్లోని హెరిటేజ్, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు పత్రాలను తగులబెట్టించారని ఆరోపించారు. పత్రాలు తగులబెట్టించిన సిట్ అధికారి అసోంకు బదిలీ అయ్యారని వివరించారు. 

'మేమంతా సిద్ధం' సభకు వెళ్లలేదని ఓ తండా వ్యక్తిని చితకబాదారని, రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించాలని చూస్తున్నారని ఉమా మండిపడ్డారు. వైసీపీ బస్సు యాత్ర తుస్సు యాత్ర అయిందని, ఈ యాత్రకు ప్రజలెవరూ రావడంలేదని ఎద్దేవా చేశారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కూటమి ముందుకెళుతోందని అన్నారు. అధికారులు ఎన్నికల కోడ్ అమలు చేయాలని కోరుతున్నామని దేవినేని ఉమా తెలిపారు.

  • Loading...

More Telugu News