BJP: మొదట లాలూప్రసాద్ మీకు 'మిసా' అని పేరెందుకు పెట్టారో తెలుసుకోండి: బీజేపీ నేతల కౌంటర్
- ప్రధాని మోదీని, బీజేపీ నేతలను జైల్లో పెడతామన్న లాలూ ప్రసాద్ కూతురు మిసా భారతి
- కాంగ్రెస్‌ను నాశనం చేసేందుకు నీ తండ్రి నీకు మిసా అని పేరు పెట్టారని తెలుసుకోవాలన్న బీజేపీ నేతలు
- మీ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రతిజ్ఞను ఎగతాళి చేస్తావా? అని ప్రశ్న
- లాలూ ప్రసాద్ యాదవ్‌పై అవినీతి ఆరోపణలు వచ్చింది యూపీఏ హయాంలోనే అని వెల్లడి
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని నరేంద్రమోదీని, బీజేపీ నేతలను జైల్లో పెడతామని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు మిసా భారతి ఇటీవల అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. "అసలు మీ నాన్న లాలూ ప్రసాద్ నీకు ఆ పేరు ఎందుకు పెట్టారో తెలుసుకోవాలి? కాంగ్రెస్ పార్టీని లేకుండా చేస్తానని మీ తండ్రి ప్రతిజ్ఞ చేస్తూ ఆ పేరు పెట్టారు... మీ తండ్రి చేసిన ప్రమాణాన్ని ఎగతాళి చేస్తావా?" అని కమలం నేతలు ప్రశ్నిస్తున్నారు.
'మిసా భారతికి తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ 'మిసా' అని ఎందుకు పేరు పెట్టారో ఆలోచించాలి. కాంగ్రెస్ మిసా (MISA- అంతర్గత భద్రతా చట్టం నిర్వహణ) కింద లాలూ ప్రసాద్ యాదవ్‌ను జైల్లో పెట్టింది. ఈ చట్టం ప్రకారం, కోర్టును ఆశ్రయించే అవకాశం లేకుండా, బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చు. ఇది శాశ్వత జైలుకు సంబంధించిన నిబంధన. అలాంటి సమయంలో నీ తండ్రి లాలూ యాదవ్ కాంగ్రెస్‌ను నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తూ... కూతురుకు 'మిసా' అని పేరు పెట్టారు. మిసా గారూ... మీరు మీ తండ్రి ప్రమాణాన్ని ఎగతాళి చేయదలుచుకున్నారా? అలా అయితే మీరు మీ పేరును మార్చుకోండి' అని బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది అన్నారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తవాడే మాట్లాడుతూ... ప్రతిపక్షాల ప్రచారం ఏ స్థాయికి దిగజారిపోయిందో మిసా భారతి వ్యాఖ్యలు చూస్తుంటే అర్థమవుతోందని మండిపడ్డారు. మోదీజీని జైల్లో పెడతామని మిసాజీ చెబుతున్నారు... అయితే అవినీతిపరులు జైలుకు వెళ్తారా? లేదా? అని దేశం చర్చిస్తోందన్నారు.
మిసా భారతి ముందుగా తన కుటుంబం గురించి ఆలోచించాలని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సూచించారు. మిసా కుటుంబం చాలా కుంభకోణాల్లో... అవినీతిలో కూరుకుపోయిందన్నారు. వారిపై అభియోగాలు మోపింది కూడా తాము కాదని గుర్తుంచుకోవాలన్నారు. గత పాలకులు అభియోగాలు మోపారని... కోర్టు వారిని శిక్షించిందన్నారు. అలాంటి వారు మోదీని జైల్లో పెడతామని చెప్పడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుందన్నారు.
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ పగటి కలలు కంటారని ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో లాలూ ప్రసాద్ యాదవ్‌కు జైలు శిక్షపడలేదని గుర్తుంచుకోవాలన్నారు. మిసా భారతి తన తండ్రి అరెస్ట్‌కు యూపీఏ ప్రభుత్వాన్ని నిందిస్తుందా? చెప్పాలని నిలదీశారు.
ఇంతకీ మిసా భారతి ఏమన్నారు?
తమ కుటుంబం అవినీతికి పాల్పడుతోందని బీజేపీ ఆరోపిస్తోందని... అయితే ఎన్నికల బాండ్లలో ఎంత పెద్ద అవినీతి జరుగుతోందో తెలుసా? అని ప్రశ్నించారు. దానికి సమాధానం చెప్పేదెవరు? ప్రజలు మాకు అవకాశం ఇస్తే బీజేపీ నేతలతో పాటు ప్రధాని మోదీ కూడా జైల్లో పెడతామని వ్యాఖ్యానించారు.