Delhi Chief Secretary: అవినీతి కేసులో ఆధారాల ధ్వంసం.. ఢిల్లీ చీఫ్ సెక్రటరీపై కేసు

Case Against Delhi Chief Secretary On Complaint Of Scam Evidence Theft

  • ఉత్తరాఖండ్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించిన ఎన్జీఓ 
  • అవినీతి కేసును వెనక్కు తీసుకోవాలంటూ అధికారులు ఒత్తిడి తెచ్చారని ఆరోపణ
  • నలుగురు ఆగంతుకులను తమ కార్యాలయానికి పంపించి బెదిరింపులకు దిగారని ఆరోపణ
  • కేసుకు సంబంధించిన ఆధారాలను తీసుకెళ్లిపోయారని ఫిర్యాదు
  • ఎన్జీఓ ఫిర్యాదుపై కేసు నమోదు చేయాలని ఉత్తరాఖండ్ కోర్టు ఆదేశాలు

ఓ అవినీతి కేసులో ఆధారాలు ధ్వంసం చేశారన్న ఆరోపణలపై ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నరేశ్ కుమార్, ఆయన సబార్డినేట్ వైవీవీజే రాజశేఖర్‌పై తాజాగా కేసు నమోదైంది. ఓ ఎన్జీవో సంస్థ ఫిర్యాదుపై ఉత్తరాఖండ్ కోర్టు తీర్పు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఎన్జీఓ సంస్థ చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరపాలని కోర్టు ఆదేశించింది. 

దడకడ గ్రామానికి చెందిన ప్లజెంట్ వ్యాలీ ఫౌండేషన్ ఈ ఫిర్యాదు చేసింది. ఫిబ్రవరి 14న అధికారులు.. నలుగురు ఆగంతుకులను తమ వద్దకు పంపించి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించింది. తాము నిర్వహిస్తున్న ఓ స్కూల్‌కు వచ్చిన ఆ నలుగురు ఎన్జీఓ జాయింట్ సెక్రటరీ ఆఫీసులోని ఫైళ్లు, రికార్డులు, పెన్‌డ్రైవ్‌లను తీసుకెళ్లారని పేర్కొంది. ఓ స్కామ్‌లో అధికారుల పాత్రకు సంబంధించిన ఆధారాలు ఇందులో ఉన్నాయని ఎన్జీఓ పేర్కొంది. 

అధికారులు పంపించిన ఆగంతుకులు బెదిరింపులకు దిగారని ఎన్జీఓ వెల్లడించింది. విజిలెన్స్ డిపార్ట్‌మెంట్‌తో పాటు ఇతర వేదికల్లో చేసిన అవినీతి ఫిర్యాదులు వెనక్కు తీసుకోవాలని ఒత్తిడి చేశారని ఎన్జీఓ పేర్కొంది. ఎన్జీఓ జాయింట్ సెక్రటరీ వారిని ప్రతిఘటించగా ఆగంతుకులు అక్కడున్న డెస్క్‌లోని రూ.63 వేల నగదు బలవంతంగా తీసుకెళ్లిపోయారని ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా, తమ వెంట తెచ్చుకున్న డాక్యుమెంట్‌పై సంతకం చేయాలని ఆగంతుకులు జాయింట్ సెక్రటరీని బలవంతం చేసే ప్రయత్నం చేశారని కూడా పేర్కొంది. 

ఎన్జీఓ సంస్థ ఫిర్యాదును స్వీకరించిన అల్మోరా కోర్టు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని గోవింద్‌పూర్ రెవెన్యూ పోలీసులను ఆదేశించింది.

  • Loading...

More Telugu News