Japan PM: అమెరికా ఒంటరి కాదు.. తోడుగా మేమున్నాం: జపాన్ ప్రకటన
- జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా అమెరికా పర్యటన
- అమెరికా చట్టసభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగం
- అంతర్జాతీయ వ్యవహారాల్లో అమెరికా నాయకత్వం కొనసాగాలని పిలుపు
- తాము అమెరికా వెన్నంటే ఉన్నామని ప్రకటన
అంతర్జాతీయ వ్యవహారాల్లో కొత్త సవాళ్లు ఎదరువుతున్న తరుణంలో అమెరికా ఎప్పటిలాగే ముందుండి నాయకత్వ పాత్ర పోషించాలని జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా అభిప్రాయపడ్డారు. ఈ భారాన్ని అమెరికా ఒంటరిగా మోయాల్సిన అవసరం లేదని, వెంట తామున్నామని భరోసా ఇచ్చారు. ఇటీవల అమెరికా వైట్ హౌస్ సందర్శన సందర్భంగా అమెరికా చట్టసభల సభ్యులను ఉద్దేశించి జపాన్ ప్రధాని ప్రసంగించారు.
అంతర్జాతీయ వ్యవహారాల్లో అమెరికా ప్రాముఖ్యాన్ని జపాన్ ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. తమ దేశం పోషిస్తున్న కీలకపాత్రపై అమెరికన్లకు సందేహాలు అవసరం లేదని అన్నారు. ఈ బాధ్యత నిర్వహిస్తున్నది తమ దేశం ఒక్కటేనన్న నిరాశ, నిస్పృహ కొందరు అమెరికన్లలో కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికాపై ఉన్న ఈ బాధ్యతల భారం పెద్దదేనని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలన్నీ ఒక్కతాటిపైకి రావాలి. ఇప్పటికే జపాన్ అమెరికా వెన్నంటి నడుస్తోంది. మీరు ఒంటరి కాదు మేమున్నాం’’ అని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతమున్న అంతర్జాతీయ సమాజం కోసం అమెరికా కొన్ని తరాల పాటు కష్టించిందని జపాన్ ప్రధాని చెప్పుకొచ్చారు. కానీ, పరిస్థితులు తలకిందులవడంతో కొత్త సవాళ్లు మొదలయ్యాయని అన్నారు. ‘‘ప్రస్తుతం చైనాయే అతిపెద్ద భద్రతాపరమైన సవాలు. ఇది జపాన్కే కాదు.. అంతర్జాతీయ శాంతి సామరస్యాలకూ చైనా సవాలుగా మారింది’’ అని అన్నారు. తప్పదనుకున్న సందర్భాల్లో అమెరికా అనేక త్యాగాలు చేసిందని కూడా జపాన్ ప్రధాని ప్రశంసించారు. అంతర్జాతీయంగా అమెరికా పాత్రను పరిమితం చేయాలని, సొంత వ్యవహారాలవైపు దృష్టి మళ్లించాలని రిపబ్లికన్లు పిలుపునిచ్చిన నేపథ్యంలో జపాన్ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.