Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు.. ఇద్దరు కీలక నిందితుల అరెస్ట్!
- జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు ప్రధాన నిందితులు
- ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్, అబ్దుల్ మతీన్ తాహాను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
- కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లలో 18 చోట్ల తనిఖీల తర్వాత నిందితుల అరెస్ట్
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1న పేలుడుకు పాల్పడిన కీలక నిందితుడు ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) శుక్రవారం అరెస్ట్ చేసింది. అతనితో పాటు సూత్రధారి అబ్దుల్ మతీన్ తాహాను కూడా ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. కర్ణాటకలో 12, తమిళనాడులో 5, ఉత్తరప్రదేశ్‌లో ఒక చోట ఇలా మూడు రాష్ట్రాల్లోని 18 ప్రాంతాల్లో తనిఖీల అనంతరం నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎన్‌ఐఏ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
అలాగే పేలుడుకు పాల్పడిన వ్యక్తికి స్థానికంగా సహకరించిన ముజమ్మిల్ షరీఫ్‌ను కూడా దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. షరీఫ్, హుస్సేన్, తాహా ఈ ముగ్గురూ ఐఎస్ఐఎస్ మాడ్యూల్స్‌తో సంబంధం కలిగి ఉన్నట్లు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. గతేడాది నవంబర్‌లో నమోదైన మంగుళూరు కుక్కర్ పేలుడు కేసుతో పాటు శివమొగ్గ గ్రాఫిటీ కేసులోనూ వీరి ప్రమేయం ఉన్నట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.