Ishan Kishan: మౌనం వీడిన ఇషాన్ కిషన్.. బీసీసీఐ కాంట్రాక్ట్ దక్కకపోవడంపై తొలిసారి స్పందన
- రంజీ ట్రోఫీ జరుగుతున్న సమయంలో ప్రాక్టీస్ చేశానన్న డ్యాషింగ్ బ్యాటర్
- సోషల్ మీడియాలో వచ్చే అన్ని అంశాలు ఆటగాళ్ల చేతుల్లో ఉండబోవని వ్యాఖ్య
- విరామ సమయంలో ఆలోచనా విధానం మారిందని చెప్పిన ఇషాన్ కిషన్
డ్యాషింగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఫామ్‌లోకి వచ్చినట్టు కనిపిస్తున్నాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్న ఇషాన్ గురువారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై మ్యాచ్‌లో చెలరేగాడు. 197 పరుగుల లక్ష్య ఛేదనలో 34 బంతుల్లోనే 69 పరుగులు బాది ముంబై గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అయితే మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఇషాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్స్‌లో చోటు దక్కకపోవడం, వివాదాస్పద రీతిలో రంజీ ట్రోఫీలో తాను ఆడకపోవడంపై తొలిసారి స్పందించాడు.
రంజీ ట్రోఫీ జరుగుతున్న సమయంలో తాను ప్రాక్టీస్ చేశానని ఇషాన్ కిషన్ చెప్పాడు. ‘‘ నేను మ్యాచ్‌లకు దూరంగా ఉన్న సమయంలో నా గురించి చాలామంది మాట్లాడుకున్నారు. సోషల్ మీడియాలో నా గురించి చాలా విషయాలు వచ్చాయి. అయితే ఈ విధంగా మాట్లాడుకునే చాలా విషయాలు ఆటగాళ్ల చేతుల్లో లేవని గ్రహించాలి’’ అని వ్యాఖ్యానించాడు.
‘‘ దక్కిన సమయాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోవడమే చేయగలిగిన ఏకైక పని. మునుపటి ఇషాన్ కిషన్ మనస్తత్వం ఏవిధంగా ఉండేదో ఒకసారి ఆలోచించండి. బౌలర్లు ఎంత బాగా బౌలింగ్ చేసినా తొలి 2 ఓవర్లలో ఒక బంతిని కూడా వదిలిపెట్టేవాడిని కాదు. 20 ఓవర్ల మ్యాచే అయినప్పటికీ టైమ్ తీసుకొని ఆడాలనే విషయాన్ని ఈ సమయంలో నేను నేర్చుకున్నాను’’ అని చెప్పాడు.
కొన్ని మ్యాచ్‌ల్లో ఓడిపోయినప్పటికీ ఒక జట్టుగా ఉమ్మడిగా ప్రయత్నించాలని భావిస్తున్నట్టు ఇషాన్ కిషన్ చెప్పాడు. తాను సరిగ్గా ప్రదర్శన చేయకపోయినా జట్టులో మార్పులు జరిగి జట్టులోకి మరొకరు వస్తారనే విషయాన్ని గ్రహించానని చెప్పాడు. రాణించలేకపోతున్న ఇతర ఆటగాళ్ల దగ్గరకు కూడా వెళ్లి వారి ఆలోచనా విధానాన్ని తెలుసుకుంటానని, విరామ సమయంలో ఈ విషయాలు తనకు ఎంతోగానో ఉపయోగపడ్డాయని ఇషాన్ కిషన్ తెలిపాడు.
కాగా మానసిక అలసటతో దక్షిణాఫ్రికా సిరీస్ నుంచి ఇషాన్ కిషన్ వైదొలిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా అంతర్జాతీయ మ్యాచ్‌ల ఎంపికకు అందుబాటులోకి రాలేదు. అయితే ఈ విరామ సమయంలో రంజీ ట్రోఫీలో కూడా పాల్గొనలేదు. పైగా హార్ధిక్ పాండ్యాతో కలిసి ఐపీఎల్ సన్నాహకాలు చేశాడు. దీంతో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో ఇషాన్ కిషన్‌కు బీసీసీఐ పెద్దలు చోటివ్వలేదు.