Ponnam Prabhakar: బీజేపీని వ్యతిరేకిస్తే ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తున్నారు: పొన్నం ప్రభాకర్
- తెలంగాణ ఏర్పాటును ప్రధాని నరేంద్రమోదీ అవమానించారన్న మంత్రి
- బీజేపీ భావోద్వేగాలతో రాజకీయాలు చేస్తోందని ఆరోపణ
- బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం
బీజేపీని వ్యతిరేకిస్తే ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రధాని నరేంద్రమోదీ అవమానించారన్నారు. విభజన చట్టంలోని హామీలను కూడా కేంద్రం నెరవేర్చలేదని విమర్శించారు. మోదీ చెప్పిన 'ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు' ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. బీజేపీ భావోద్వేగాలతో రాజకీయాలు చేస్తోందన్నారు. మోదీ, అమిత్ షా కలిసి దేశంలోని నవరత్న సంస్థలను అమ్మివేశారని ఆరోపించారు.
కేంద్రం తెచ్చిన నల్ల సాగుచట్టాలు రైతుల ఆత్మ హత్యలకు కారణమయ్యాయన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. చేనేతలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందన్నారు.