KTR: కడియం శ్రీహరి చేసిన మోసం ఎవరూ చేయలేదు... ఆయన చేసింది నయవంచన: కేటీఆర్

KTR responds on Kadiam Srihari and brs changes

  • కేకేకు అధిక ప్రాధాన్యత ఇచ్చినా పార్టీని వీడారని వ్యాఖ్య
  • బీఆర్ఎస్ పేరు మార్చాలని సూచనల వచ్చాయి కానీ సాంకేతిక సమస్య ఉందని వెల్లడి
  • లీకు వీరుడు అంటూ రేవంత్ రెడ్డిపై విమర్శలు

గత రెండున్నర దశాబ్దాల్లో కేసీఆర్‌ను ఎంతోమంది మోసం చేశారని... కానీ కడియం శ్రీహరి చేసిన మోసం మాత్రం ఎవరూ చేయలేదని, ఆయన చేసింది నయవంచన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం కూతురు కావ్యకు లోక్ సభ టిక్కెట్ ఇచ్చిన తర్వాత ఆయన పార్టీని వీడారని మండిపడ్డారు. ఇప్పుడు తాము మొదటి నుంచి పార్టీలో ఉన్న సుధీర్ కుమార్‌కు టిక్కెట్ ఇచ్చామని వెల్లడించారు. కే కేశవరావుకు కూడా రెండుసార్లు రాజ్యసభ ఇచ్చామని, ఆయన కూతురుకు మేయర్ పదవి ఇచ్చామని... అయినా పార్టీని వీడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన టీవీ9 'క్రాస్ ఫైర్'లో మాట్లాడుతూ... పార్టీ నుంచి వెళ్లేటప్పుడు చాలామంది ఏవో సాకులు చెప్పి లేదా రాళ్లు వేసి వెళుతుంటారన్నారు.

తమ పొరపాటు వల్లే తాము అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామన్నారు. స్వల్పతేడాతో మాత్రమే ఓడామని... అందుకు తమకు ఏమీ బాధ లేదన్నారు. ఉద్యమ పార్టీగా విజయవంతమయ్యామని... ప్రభుత్వంలో ఉండి తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి తీసుకు వెళ్లామన్నారు. ఇందుకు సంతృప్తిగా ఉందన్నారు. కానీ రైతుబంధు, దళితబంధు, కార్యకర్తల విషయంలో జరిగిన పొరపాట్లను తాము గ్రహించలేకపోయామన్నారు.

బీఆర్ఎస్ పేరును మార్చాలని సూచనలు

బీఆర్ఎస్ పేరును మార్చాలని తమకు చాలా సూచనలు వచ్చాయని... కానీ సాంకతిక సమస్యలు ఉన్నాయన్నారు. అయినా తమ గుర్తు, జెండా, అజెండా మారలేదన్నారు. ఎన్టీఆర్ కూడా నాడు భారతదేశం పేరుతో జాతీయ పార్టీ పెట్టాలని భావించారని, చంద్రబాబు టీడీపీని జాతీయ పార్టీగా మార్చారని గుర్తు చేశారు. రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి ప్రజాభీష్టం మేరకు పనిచేయాలని భావించినట్లు చెప్పారు. దాదాపు పాతికేళ్లు కేసీఆర్ చుట్టూ రాజకీయాలు తిరిగాయన్నారు.

వలసలు నివారించేందుకు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించగా... అసలు ఏ పార్టీకైనా కార్యకర్తలే పునాది అన్నారు. తమకు కార్యకర్తల బలం ఉందన్నారు. అలాగే ప్రజల కోసం పని చేయాలన్నారు. కేసీఆర్ ఎంతోమంది నాయకులను తయారు చేశారన్నారు. తమది నాయకులను తయారు చేసే కర్మాగారమన్నారు. తాము ప్రజలే కేంద్రబిందువులుగా పని చేస్తామని చెప్పారు. తమ పార్టీ నుంచి నాయకులు పోతారని చెబుతున్నారని.. కానీ అసలు కాంగ్రెస్‌లో ఎవరు మిగులుతారో? బీజేపీలో ఎవరు మిగులుతారో? చూడాలన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయిదేళ్లు నిక్షేపంగా ఉండాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. 420 హామీలు అమలు చేయకుంటే మాత్రం నిలదీస్తామన్నారు. రేవంత్ రెడ్డి పక్కన నల్గొండ, ఖమ్మం బాంబులు ఉన్నాయని విమర్శించారు.

లీకు వీరుడు అంటూ రేవంత్ రెడ్డిపై విమర్శలు

తాము 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. వాటిని నెరవేర్చకుండా శ్వేతపత్రమంటూ, ఫోన్ ట్యాపింగ్ అంటూ పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ సహా వివిధ అంశాలపై లీకులు ఇస్తున్నారని.. ఆ లీకు వీరుడు ఆధారాలు ఇచ్చి కోర్టుకు వెళ్లి శిక్షించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డిని తాము అయితే సీఎంగా చూడటం లేదన్నారు. మెడలో పేగులు వేసుకుంటా... ఇలాంటి మాటలు ముఖ్యమంత్రి మాట్లాడుతారా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News