KTR: నార్కో అనాలసిస్‌కు నేను సిద్ధం... రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి సిద్ధమా?: ఫోన్ ట్యాపింగ్‌పై కేటీఆర్ సవాల్

KTR challenges Revanth Reddy and Kishan Reddy on phone tapping issue

  • రేవంత్ రెడ్డి తన మంత్రుల ఫోన్లను ట్యాపింగ్ చేయలేదని పరీక్షలకు సిద్ధమా? అని సవాల్
  • అలా చేస్తే టీవీ9, రేవంత్ రెడ్డిపై కూడా పరువునష్టం దావా వేస్తానని హెచ్చరిక
  • బీజేపీలోకి జంప్ అవుతారనే తన ఆరోపణలపై రేవంత్ రెడ్డి స్పందించడం లేదని వ్యాఖ్య
  • బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందని ఆరోపణ

ఫోన్ ట్యాపింగ్ కేసులో తాను లైడిటెక్టర్ పరీక్షలకు, నార్కో అనాలసిస్‌కు సిద్ధమని, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మరి రేవంత్ రెడ్డి కూడా తన మంత్రుల ఫోన్లను ట్యాపింగ్ చేయలేదని నార్కో అనాలసిస్‌కు సిద్ధమా? పెగాసిస్‌పై కిషన్ రెడ్డి సిద్ధమా? అని సవాల్ చేశారు. వారు కూడా వస్తానంటే తాను దేనికైనా రెడీ అన్నారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఫోన్లను ట్యాప్ చేయలేదని రేవంత్ రెడ్డి లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమేనా? అని నిలదీశారు.

శుక్రవారం టీవీ9 'క్రాస్ ఫైర్'లో ఆయన మాట్లాడుతూ... జాతీయ భద్రత కోసం ఫోన్ ట్యాపింగ్ అవసరమని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతంలోనే చెప్పారని గుర్తు చేశారు. 2010లో దిగ్విజయ్ సింగ్, శరద్ పవార్, ప్రకాశ్ కారత్ ఫోన్లను నాటి యూపీఏ ప్రభుత్వం ట్యాప్ చేసిందన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా తమ ఫోన్లను కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ట్యాప్ చేసిందని పొన్నం ప్రభాకర్, వివేక్‌లు ఆరోపించారని గుర్తు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డిపై శంకర్ రావు ఫిర్యాదు చేశారన్నారు. కానీ చట్టవ్యతిరేకంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తే మాత్రం వారు శిక్షార్హులే అన్నారు.

ఎక్కడైనా, ఎప్పుడైనా నేను సిద్ధం

ఫోన్ ట్యాపింగ్ విషయంలో కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డితో ఎక్కడ చర్చ పెట్టినా తాను సిద్ధమే అన్నారు. నేనేదో బెదిరించానని వారు ఆరోపణలు చేస్తున్నారని... వారికి చిత్తశుద్ధి ఉంటే తనలా లైడిటెక్టర్ పరీక్షలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సవాల్ చేశారు. తాను లైడిటెక్టర్ లేదా నార్కో అనాలసిస్ దేనికైనా... ఎప్పుడైనా... ఎక్కడైనా రెడీ అన్నారు. తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానన్నారు. కానీ వారు కూడా తన సవాల్‌కు ముందుకు రావాలన్నారు. మేం బురదజల్లుతాం... మీరు మాత్రమే నిప్పుల్లో దూకండి అంటే ఎలా... వారు వస్తే తానూ సిద్ధమన్నారు. వారిలా తాను కూడా ఆరోపణలు చేస్తున్నానని.. రేవంత్ రెడ్డి తన మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని, కిషన్ రెడ్డి పెగాసిస్ ద్వారా ట్యాపింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు. 

అలా చేస్తే టీవీ9, రేవంత్ రెడ్డిపై కూడా పరువునష్టం దావా వేస్తా

గతంలో గోకుల్ చాట్ వంటి టెర్రరిస్ట్ దాడులు జరిగాయని... కానీ తమ ప్రభుత్వం వచ్చాక అలాంటివి జరగలేదన్నారు. ఇలాంటి సందర్భాల్లో ఫోన్ ట్యాపింగ్ అవసరమని అభిప్రాయపడ్డారు. కానీ అధికార దుర్వినియోగం చేస్తే మాత్రం కచ్చితంగా శిక్షార్హులే అన్నారు. అలాంటి వారిని విచారించి జైల్లో వేయాలన్నారు. తనపై చేసిన ఆరోపణలకు గాను మంత్రి కొండా సురేఖ తదితరులకు నోటీసులు ఇచ్చానని.. అలాంటి వీడియోను ప్లే చేస్తే తాను టీవీ9 ఛానల్‌కు కూడా నోటీసులు పంపిస్తానని హెచ్చరించారు. తనను రేవంత్ రెడ్డి అన్నా... ఆయన పైనా పరువునష్టం దావా వేస్తానన్నారు. ఆధారాలు లేకుండా మాట్లాడుతానంటే ఎలా? అని ధ్వజమెత్తారు. పరీక్షలకు వారు వస్తే నీతిమంతులు ఎవరో తేలిపోతుందన్నారు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి బ్రదర్స్ అని ఎద్దేవా చేశారు. 

రేవంత్ రెడ్డి  బీజేపీలోకి జంప్ అవుతారు

ప్రధాని మోదీని బడేబాయ్ అని రేవంత్ రెడ్డి అంటే రాహుల్ గాంధీ చౌకీదార్ దొంగ అంటారని, కవిత అరెస్టును రేవంత్ సమర్థిస్తే, కేజ్రీవాల్ అరెస్టును రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తున్నారని, రేవంత్ రెడ్డి గుజరాత్ మోడల్ అంటే, రాహుల్ గాంధీ ఫేక్ మోడల్ అంటారని కేటీఆర్ అన్నారు. అసలు రేవంత్ రెడ్డి... రాహుల్ గాంధీ పార్టీలో ఉన్నారా? మోదీ పార్టీలో ఉన్నారా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీలోకి జంప్ అవుతారని జోస్యం చెప్పారు. తాను మాట్లాడే ప్రతి అంశంపై మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి.. బీజేపీలోకి వెళతారు అంటే మాత్రం స్పందించడం లేదన్నారు.

కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టింది

రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసును సీబీఐకి అప్పగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసిందని గుర్తు చేశారు. మరి ఇప్పుడు ఏమయిందని ప్రశ్నించారు. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కాంగ్రెస్ ఇక్కడ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందని విమర్శించారు. దానం నాగేందర్‌కు కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చి పదిహేను రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు ప్రచారం ప్రారంభించలేదన్నారు. అయినా తాము 9 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

దేశంలో బీజేపీకి లేదా కాంగ్రెస్ పార్టీలకు మెజార్టీ రాదన్నారు. అందుకే తాము 9 నుంచి 12 స్థానాలు గెలిస్తే ఉపయోగం ఉంటుందన్నారు. తెలంగాణ ప్రజలు తమ గొంతును ఢిల్లీకి పంపించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ-బీఆర్ఎస్ మధ్య ఎలాంటి సంబంధాలు లేవన్నారు. బీజేపీ కీలక నేతలను ఓడించిందే తాము అన్నారు.

తెలంగాణలో కొరుకుడుపడని కొయ్య కేసీఆర్ అని బీజేపీకి అర్థమైందన్నారు. బీజేపీ తీరు ఉంటే బీజేపీతో ఉండు లేదంటే ఈడీ, సీబీఐ కేసులు అన్న విధంగా ఉందని మండిపడ్డారు. తాము మాత్రం అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడలేదన్నారు.

  • Loading...

More Telugu News