Telangana Intermediate Results: ఈ నెల 20వ తేదీ తర్వాతే తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు
- ఇప్పటికే పూర్తయిన మూల్యాంకన ప్రక్రియ
- ఒకేసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ప్రకటించే అవకాశం
- ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19వ తేదీ వరకు జరిగిన ఇంటర్ పరీక్షలు
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు ఈ నెల 20వ తేదీ తర్వాత విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మూల్యాంకన ప్రక్రియ పూర్తయింది. మొత్తం 4 విడతల్లో మూల్యాంకనం నిర్వహించి ఈ నెల 10వ తేదీన పూర్తి చేశారు. ప్రస్తుతం నమోదైన మార్కుల పరిశీలన జరుగుతున్నట్లు సమాచారం. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫలితాలు విడుదల కానున్నాయి. ఒకేసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.
కాగా, ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఇలా పరీక్షలు జరుగుతున్న సమయంలోనే మార్చి 10వ తారీఖు నుంచి అధికారులు మూల్యాంకన ప్రక్రియ ప్రారంభించారు. మార్కుల నమోదుతో పాటు ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.