Telugudesam: విరాళాలు ఇవ్వాలన్న చంద్రబాబు పిలుపునకు విశేష స్పందన.. పోటెత్తుతున్న డొనేషన్లు
- మూడు రోజుల క్రితం ‘టీడీపీ ఫర్ ఆంధ్ర’ వెబ్సైట్ ప్రారంభం
- ఇప్పటికే ఐదు వేలమందికిపైగా విరాళాలు
- ప్రాణాలకు తెగించి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్న టీడీపీ
- ప్రపంచంలో ఎక్కడున్నా నవ్యాంధ్ర నిర్మాణంలో పాలుపంచుకోవాలని పిలుపు
పార్టీకి విరాళాలు ఇవ్వాలంటూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన లభిస్తోంది. విరాళాల సేకరణ కోసం మూడు రోజుల క్రితం ‘టీడీపీ ఫర్ ఆంధ్ర’ వెబ్సైట్ను ప్రారంభించారు. ఇప్పటికే 5 వేల మందికిపైగా విరాళాలు అందించారు. ఈ సందర్భంగా పార్టీ నిన్న ఓ ప్రకటన విడుదల చేసింది. నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పోరాడుతోందని పేర్కొంది. లక్షల మంది తెలుగు ప్రజల మద్దతుతో పసుపు జెండా ఎగురుతూనే ఉందని తెలిపింది.
ఐదేళ్ల అరాచక పాలన కారణంగా రాష్ట్రం ప్రస్తుతం దారుణ పరిస్థితుల్లో ఉందని, పోలవరం, రాజధాని నిర్మాణాలు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ప్రాణాలకు తెగించి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని, ప్రపంచంలో ఎక్కడున్నా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి విరాళం అందించి నవ్యాంధ్ర పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని టీడీపీ కోరింది.