Siddaramaiah: కర్ణాటకలో ‘ఆపరేషన్ లోటస్’.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 50 కోట్ల ఆఫర్.. సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు
- కర్ణాటకలో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ఏడాది కాలంగా ప్రయత్నిస్తోందన్న సిద్దరామయ్య
- కర్ణాటక లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితే ప్రభుత్వం పడిపోతుందన్న వ్యాఖ్యలను కొట్టిపడేసిన సీఎం
- ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీ వీడరని స్పష్టీకరణ
- సిద్దరామయ్య ఆరోపణలను ఖండించిన బీజేపీ ఎంపీ ప్రకాశ్
సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ ‘ఆపరేషన్ లోటస్’ ప్రారంభించిందని, కాంగ్రెస్ ఎమ్మెల్యేకు రూ. 50 కోట్ల చొప్పన ఆఫర్లు ఇస్తోందని పేర్కొన్నారు. ‘ఇండియా టీవీ’ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటకలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కనుక ఓటమి పాలైతే ప్రభుత్వం కూలిపోతుందంటూ బీజేపీ చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించగా ఆయనిలా స్పందించారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఏడాది కాలంగా బీజేపీ ప్రయత్నిస్తోందని, ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు రూ. 50 కోట్ల చొప్పున ఆఫర్ చేస్తోందని ఆరోపించారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలైతే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం అప్పుడు ఈజీ అవుతుందా? అన్న ప్రశ్నకు అది సాధ్యం కాదని కొట్టిపడేశారు. ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీని వీడరని స్పష్టం చేశారు. తన నేతృత్వంలోని ప్రభుత్వం ఐదేళ్లూ కొనసాగుతుందని పేర్కొన్నారు. కాగా, ఇదే ఇంటర్వ్యూలో ఫోన్ కాల్ ద్వారా జాయిన్ అయిన బీజేపీ ఎంపీ ఎస్ ప్రకాశ్ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఇలాంటి ఆరోపణలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. సిద్దరామయ్య తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.