BJP: రేపు మేనిఫెస్టోను విడుదల చేయనున్న బీజేపీ
- సంకల్ప పత్రం పేరుతో విడుదల చేయనున్న ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు
- మేనిఫెస్టో తయారీకి 15 లక్షలకు పైగా వచ్చిన సూచనలు
- మేనిఫెస్టో కోసం వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకున్న బీజేపీ
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తమ మేనిఫెస్టోను ఏప్రిల్ 14న విడుదల చేయనుంది. కమలం పార్టీ సంకల్ప పత్రం పేరుతో దీనిని విడుదల చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు ఈ సంకల్ప పత్రాన్ని ఆవిష్కరించనున్నారు. 'మోదీ గ్యారెంటీ: 2047 నాటికి వికసిత్ భారత్' థీమ్‌తో మేనిఫెస్టోను రూపొందించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అభివృద్ధి, సుసంపన్న భారత్, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన అజెండాగా దీనిని తీర్చిదిద్దినట్లు చెబుతున్నారు.
రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యులతో కూడిన మేనిఫెస్టో కమిటీ ఇందుకోసం ఇప్పటికే రెండుసార్లు కీలక సమావేశాలు నిర్వహించింది. ప్రజల నుంచి సలహాలు, సూచనలను స్వీకరించింది. సంకల్పపత్రం కోసం బీజేపీ ప్రజల నుంచి అభిప్రాయాలు కోరింది. దాదాపు 15 లక్షల సూచనలు రాగా, ఇందులో 4 లక్షలకు పైగా అభిప్రాయాలు నమో యాప్ ద్వారా పార్టీతో పంచుకున్నారు. వీటన్నింటిని పరిశీలించిన కమిటీ మేనిఫెస్టోను రూపొందించింది.