Revanth Reddy: కవిత అరెస్ట్‌తో బీఆర్ఎస్‌కు సానుభూతి వస్తుందా?: రేవంత్ రెడ్డి ఆసక్తికర సమాధానం
- కవిత అరెస్ట్ ఎన్నికలపై ప్రభావం చూపదన్న రేవంత్ రెడ్డి
- కేసీఆర్ అరెస్ట్ అయి ఉంటే బీఆర్ఎస్‌కు సానుభూతి లభించి ప్రభావం చూపేదని వ్యాఖ్య
- తెలంగాణకు సంబంధించిన కేసులో కవిత అరెస్ట్ కాలేదన్న రేవంత్ రెడ్డి
కవిత అరెస్ట్ లోక్ సభ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపబోదని... మాజీ సీఎం కేసీఆర్‌ను అరెస్ట్ చేసి ఉంటే ప్రభావం కనిపించి ఉండేదేమోనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇండియా టీవీలో రజత్ శర్మ హోస్ట్‌గా వ్యవహరించే 'ఆప్ కీ అదాలత్' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా, ఢిల్లీ మద్యం కేసులో కవితను అరెస్ట్ చేయడం వల్ల బీఆర్ఎస్‌కు సానుభూతి లభిస్తుందా? అని రజత్ శర్మ ప్రశ్నించారు.
దీనికి రేవంత్ రెడ్డి స్పందిస్తూ... కవిత తెలంగాణలో జరిగిన అవినీతి కేసులో అరెస్ట్ కాలేదని పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం అవినీతి కేసులో ఆమె అరెస్ట్ అయ్యారన్నారు. కవిత అరెస్ట్ ప్రభావం చూపించదన్నారు. ఈ అరెస్టుకు తెలంగాణలో ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ అరెస్ట్ అయి ఉంటే ఎన్నికలపై ప్రభావం చూపి ఉండేదని వ్యాఖ్యానించారు.
రాజీవ్ గాంధీ హయాంలోనే శిలాన్యాస్
అయోధ్యలో రాజీవ్ గాంధీ హయాంలోనే శిలాన్యాస్ జరిగిందని రేవంత్ రెడ్డి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయోధ్య క్రెడిట్ ప్రధాని మోదీ ఎందుకు తీసుకుంటున్నారు? అని ప్రశ్నించారు. వారు రాజకీయ లబ్ధి కోసం చూస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రతి అంశానికి దేవుడిని ఉపయోగించుకుంటోందని, ఇది సరికాదన్నారు. తమ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ కూడా శివభక్తుడు అని గుర్తు చేశారు.