DK Aruna: ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం: డీకే అరుణ
- తప్పు చేసిన వారు ఎవరూ శిక్ష నుంచి తప్పించుకోలేరని వ్యాఖ్య
- కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అమలు చేయలేదని విమర్శ
- కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఓటు అడిగే నైతిక హక్కు లేదన్న డీకే అరుణ
ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని మహబూబ్నగర్ లోక్ సభ నియోజకవర్గ బీజేపీ నేత డీకే అరుణ జోస్యం చెప్పారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా వనపర్తి జిల్లాలో ఆమె మాట్లాడుతూ... తప్పు చేసిన వారు ఎవరూ శిక్ష నుంచి తప్పించుకోలేరన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిందని... కానీ 100 రోజులు దాటినా వాటిని పూర్తిగా అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.
ఆరు గ్యారంటీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత బస్సు పథకంలో మహిళలు సిగలు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ పథకం అమలు చేసినప్పుడు బస్సులను పెంచాలన్న కనీస ఆలోచన లేకపోవడం దారుణమన్నారు. కాంగ్రెస్ పార్టీ రావణాసురుడి వంటిదని... అలాంటి పార్టీని తెలంగాణలో ఉండనీయకూడదన్నారు.