K Kavitha: కవితను కలిసేందుకు సీబీఐ కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్, భర్త అనిల్ కుమార్
- ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు సీబీఐ కస్టడీ
- ఈ నెల 15 వరకు కవితను విచారించనున్న సీబీఐ
- న్యాయవాది, కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితకు కోర్టు అనుమతి
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 15 వరకు సీబీఐ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. కాగా, కస్టడీ సమయంలో సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య కవిత తన న్యాయవాదితో 30 నిమిషాలు, కుటుంబ సభ్యులతో 15 నిమిషాలు మాట్లాడేందుకు కోర్టు అనుమతించింది.
ఈ నేపథ్యంలో, కవితను కలిసేందుకు కేటీఆర్, కవిత న్యాయవాది మోహిత్ రావు, కవిత భర్త అనిల్ కుమార్ ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. నిబంధనల మేరకు వారు కవితను కలిసి మాట్లాడనున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అప్రూవర్లుగా మారిన మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి, దినేశ్ ఆరోరా తదితరుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా కవితను సీబీఐ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో సాక్షులను, సాక్ష్యాధారాలను కవిత ముందు ఉంచి ఈ మేరకు ఆమె నుంచి సమాచారం రాబట్టాలని సీబీఐ భావిస్తోంది.