Pawan Kalyan: చిన్నప్పుడు శివశివానీ స్కూల్లో పరీక్ష పేపర్లు కొట్టేసిన వ్యక్తి జగన్: పవన్ కల్యాణ్
- తెనాలిలో వారాహి విజయభేరి సభ
- నాదెండ్ల మనోహర్, పెమ్మసాని చంద్రశేఖర్ లకు మద్దతుగా పవన్ ప్రచారం
- సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు
తెనాలి అసెంబ్లీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్, గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ లకు మద్దతుగా జనసేనాని పవన్ కల్యాణ్ తెనాలిలో వారాహి విజయభేరి సభకు హాజరయ్యారు. ఈ సభలో ఆయన సీఎం జగన్ పై ధ్వజమెత్తారు.
ప్రజల పాస్ పుస్తకాలపై, పొలాల్లో హద్దు రాళ్లపై కూడా చెదరని చిరునవ్వుతో జగన్ ఫొటోలు కనిపిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రం తన సొత్తు అనుకుంటున్నాడు... జగన్.. నువ్వు కిందపడే రోజు దగ్గర్లోనే ఉంది అంటూ హెచ్చరించారు. జగన్ కు అహంకారం తలకెక్కిందని, అందరం ఆయనకు బానిసలం అనుకుంటున్నాడని మండిపడ్డారు.
ఈజిప్టులో హోస్నీ ముబారక్ అనే నేత 30 ఏళ్లుగా నిరంకుశంగా వ్యవహరించాడని, ఓ టైలర్ తిరుగుబాటు మిగతా ప్రజలను చైతన్యవంతులను చేసి హోస్నీ ముబారక్ అంతు చూసిందని వివరించారు. శ్రీలంకలో కూడా ప్రజాగ్రహం పెల్లుబుకిందని, ప్రజలు దేశాధ్యక్షుడి భవనంలోకి వెళ్లి స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టారని... రేపు తాడేపల్లి ప్యాలెస్ లో కూడా ఇలాగే ప్రజలు వచ్చి కూర్చుంటారని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారిని మద్యం షాపుల వద్ద కాపలా పెట్టించాడని, సమస్యల పరిష్కారం గురించి అడిగిన అంగన్వాడీలను కొట్టించాడని ఆరోపించారు. చిన్నప్పుడు శివశివానీ స్కూల్లో పరీక్ష పేపర్లు కొట్టేసిన వ్యక్తి జగన్ అని ఎద్దేవా చేశారు.
నా జ్ఞానానికి కారణం ఆ వైశ్య మిత్రుడే!
నేను ఇవాళ ఇంత జ్ఞానం సంపాదించడానికి నా చిన్ననాటి వైశ్య మిత్రుడు అందించిన పుస్తకాలే కారణం. వైశ్య సోదరులపై దాడులు జరగకుండా, వ్యాపారాలు సాఫీగా జరిగేలా చూస్తాం. స్థానిక బంగారు వ్యాపారులకు అండగా నిలబడతాం. అసలైన పాలన ఎలా ఉంటుందో తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ ద్వారా చేసి చూపిస్తాం. ఇక్కడి రైతుల సంక్షేమం కోసం పాటుపడతాం. చెక్ డ్యాముల నిర్మాణం చేపడతాం. అసెంబ్లీలో బూతులు తిట్టే సంప్రదాయాన్ని అడ్డుకుంటాం. చట్టసభలో సమస్యలపై చర్చ జరిగేలా చూస్తాం.
దోపిడీ చేస్తూ బలిసి కొట్టుకుంటున్నారు
రాష్ట్రంలో కొందరు జగన్ మనుషులు ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తూ బలిసి కొట్టుకుంటున్నారు. పెద్దిరెడ్డి కుటుంబం, సజ్జల కుటుంబం ఇసుకను ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే భవన నిర్మాణ కార్మికుల నిధి డబ్బులు దోచేసిన వ్యక్తి జగన్. ఇసుక దొరక్కుండా చేసి 21 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశాడు.