Israel: సరైన సమయంలో ఇరాన్‌పై ప్రతీకారం.. ఇజ్రాయెల్ ప్రకటన
- ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకునేలా ప్రతిఘటిస్తామన్న ఇజ్రాయెల్ మంత్రి బెన్నీ గాంట్జ్
- సరైన పద్ధతిని ఎంచుకొని ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిక
- ఇజ్రాయెల్‌పై దాడిని ‘ఆత్మ రక్షణ హక్కు’గా అభివర్ణించిన ఇరాన్
అనూహ్య రీతిలో డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ దాడి చేసినప్పటికీ... ప్రస్తుతానికి ఎలాంటి ప్రతిఘటన చర్యలకు దిగని ఇజ్రాయెల్ కీలక ప్రకటన చేసింది. తగిన సమయం చూసుకొని, సరైన పద్ధతిని ఎంచుకుని ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. తమ భూభాగంపై దాడులకు పాల్పడ్డ ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకునేలా చేస్తామని ఇజ్రాయెల్ మంత్రి బెన్నీ గాంట్జ్ ఆదివారం రాత్రి వార్నింగ్ ఇచ్చారు.
కాగా ఇజ్రాయెల్‌పై దాడి తమ ‘ఆత్మ రక్షణ హక్కు’ అని ఇరాన్ వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ రాయబారి వ్యాఖ్యానించారు. సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేసిందని, ప్రతిస్పందనగా ఈ చర్యకు దిగామని పేర్కొన్నారు. ఈ విషయం ఇంతటితో ముగిసిపోయిందని, ఇజ్రాయెల్ మిలిటరీ చర్యకు దిగరాదనీ ఇరాన్ హెచ్చరించింది. ఇజ్రాయెల్ మరో తప్పు చేస్తే ఇరాన్ ప్రతిస్పందన చాలా తీవ్రంగా ఉంటుందని ఇరాన్ ప్రతినిధి వార్నింగ్ ఇచ్చారు.
మరోవైపు ఇరాన్‌పై ప్రతీకార చర్యలకు దిగితే ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వబోమని అమెరికా కూడా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇక ఇరుదేశాల మధ్య వివాదం, ఉద్రిక్తతలు పెరగకుండా అంతర్జాతీయ సమాజం సమష్టిగా కృషి చేయాలని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ పిలుపునిచ్చారు.