BJP: తెలంగాణ బీజేపీలో కలవరం.. అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన 10 మంది జంప్
- క్యూలో మరింతమంది నేతలు
- పాలమూరులో దాదాపు ఖాళీ
- డీకే అరుణను ఒంటరిని చేసే వ్యూహంలో కాంగ్రెస్
తెలంగాణ బీజేపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నిలిచిన అభ్యర్థుల్లో ఇప్పటికే పదిమంది పార్టీకి టాటా చెప్పేశారు. త్వరలోనే మరికొందరు కూడా క్యూలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
పార్టీని వీడిన వారిలో కూన శ్రీశైలం గౌడ్, పులిమామిడి రాజు, ఆరెపల్లి మోహన్, శ్రీగణేశ్, రవీంద్ర నాయక్, చలమల కృష్ణారెడ్డి, బాబు మోహన్, రతన్ పాండురంగారెడ్డి, జలంధర్‌రెడ్డి, మిథున్‌రెడ్డి ఉన్నారు. నిన్నమొన్నటి వరకు పార్టీలో కీలకంగా వ్యవహరించిన మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి సైతం జంపయ్యారు. వెళ్తూవెళ్తూ తనయుడు మిథున్‌రెడ్డి, రతన్ పాండురంగారెడ్డిని వెంట తీసుకెళ్లారు.
ఇతర నేతలను కూడా కాంగ్రెస్‌లోకి ఆకర్షించడం ద్వారా పాలమూరులో బీజేపీని ఒంటరి చేయాలన్న వ్యూహం దీనివెనక ఉన్నట్టు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ రోజురోజుకు మరింత బలహీనపడుతోంది. దీంతో నేతలు ‘చే’జారకుండా జాగ్రత్తలు పడుతోంది.